ముగిసిన ఇంటర్ పరీక్షలు
పుట్టపర్తి/పుట్టపర్తి టౌన్: జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. చివరి రోజు శనివారం కెమిస్ట్రీ/కామర్స్/సోషియాలజీ, ఒకేషనల్ గ్రూపులకు సంబంధించి ఫైన్ ఆర్ట్స్ పరీక్షలు జరిగాయి. జనరల్ విద్యార్థులు 9,057 మందికి గాను 8,877 మంది, ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 785 మందికి గాను 745 మంది హాజరైనట్లు జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాఽశాఖాధికారి రఘునాథరెడ్డి తెలిపారు. మొత్తంగా 214 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ గ్రూపులకు సంబంధించిన విద్యార్థులకు ఈనెల 18, 20వ తేదీల్లో పరీక్షలు ఉంటాయని వెల్లడించారు.
ఇంటర్ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్పీ
ఇంటర్ పరీక్షలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసినట్లు ఎస్పీ రత్న తెలిపారు. శనివారం ఆమె స్థానిక మంగళకర కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఎస్పీ వెంట రూరల్ ఎస్‌ఐ లింగన్న ఉన్నారు.
రేపటి నుంచి ‘పది’ పరీక్షలు
● పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు●
● హాజరు కానున్న
2,23,730 మంది విద్యార్థులు
● జిల్లాలో 104 కేంద్రాల ఏర్పాటు
పుట్టపర్తి: పదో తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 17వ తేదీ (సోమవారం) ప్రారంభం కానున్నాయి. జిల్లా నుంచి 2,23,730 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానుండగా, 104 కేంద్రాలు ఏర్పాటు చేశామని డీఈఓ కృష్ణప్ప శనివారం విలేకరులకు తెలిపారు. 17వ తేదీ ఫస్ట్ లాంగ్వేజ్, 19వ తేదీన సెకండ్ లాంగ్వేజ్, 21న ఇంగ్లిష్, 24న గణితం, 26న ఫిజిక్స్, 28న బయాలజీ, 29న ఒకేషనల్, మార్చి 31న సోషల్ స్టడీస్ పరీక్ష ఉంటుదని తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా కేంద్రాల్లో నీటి వసతి, ఫర్నీచర్, ఫ్యాన్లు ఏర్పాటు చేశామన్నారు. మాస్ కాపీయింగ్, కాపీయింగ్‌కు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. విద్యార్థులు ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని డీఈఓ సూచించారు.
1,400 మంది ఇన్విజిలేటర్ల నియామకం
జిల్లాలో 104 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా...1,400 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు డీఈఓ కృష్ణప్ప వెల్లడించారు. అలాగే 104 మంది ఛీప్ సూపరింటెండెంట్లు,104 మంది డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లను, 13 మంది అడిషనల్ డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లను నియమించామని తెలిపారు.
ముగిసిన ఇంటర్ పరీక్షలు
Comments
Please login to add a commentAdd a comment