ప్రకృతి వ్యవసాయంపై 22 నుంచి సదస్సు
ప్రశాంతి నిలయం: అనంత సుస్థిర వ్యవసాయ వేదిక ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకూ అనంతపురంలో జరిగే సదస్సును సద్వినియోగం చేసుకోవాలని రైతులకు కలెక్టర్ టీఎస్ చేతన్ పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి ‘మన వ్యవసాయం, పంటలు, వంటలు, ఆరోగ్యం’ అంశంతో ముద్రించిన పోస్టర్లను సోమవారం కలెక్టరేట్‌లో ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. 22న పకృతి వ్యవసాయంపై, 23న పంటలు, వంటలు, ఆరోగ్యంపై, 24న మారుతున్న వాతావరణ పరిస్థితులు– వ్యవసాయంపై సదస్సులు ఉంటాయన్నారు. రోజూ వెయ్యి మంది రైతులు పాల్గొనేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు హాజరై ప్రకృతి వ్యవసాయంపై కొత్త విషయాలను వివరిస్తారని, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలతో కలసి నిర్వహిస్తున్న సదస్సును సద్వినియోగం చేసుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, జేడీఏ సుబ్బారావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, జనజాగృత స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు డీపీ బలరాం, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు సీడీసీ శంకర్, టింబక్ట్ శ్రీకాంత్, సుస్థిర వ్యవసాయ వేదిక ప్రతినిధులు ఆదినారాయణ, ఉత్తప్ప తదితరులు పాల్గొన్నారు.
తాగునీటి సమస్య తలెత్తరాదు: వేసవి ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలో ఎక్కడేగాని తాగునీటి సమస్య తలెత్తరాదని కలెక్టర్ చేతన్ ఆదేశించారు. తాగునీరు, వడగాలులు, పీ–4 సర్వే, రీ సర్వే, పీజీఆర్‌ఎస్ అంశాలపై సోమవారం కలెక్టరేట్ నుంచి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన సమీక్షించారు. తాగునీటి సమస్యలు తలెత్తే ప్రాంతాలను ముందస్తుగా గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాబోవు మూడు నెలలు ఎంతో కీలకమని, పీ–4 అమలుపై ప్రజాభిప్రాయ సేకరణను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. జేసీ అభిషేక్‌కుమార్, అన్ని మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
పోస్టర్లు విడుదల చేస్తున్న కలెక్టర్ టీఎస్ చేతన్
Comments
Please login to add a commentAdd a comment