
ఊర పిచ్చుక.. ఊరికే అందం
ఒక ఊరిలో పిచ్చుక కనిపిస్తే ఆ ఊరు పచ్చగా ఉన్నట్లు గ్రామీణులు ఓ అంచనా వేస్తుంటారు. పిచ్చుకలు కనిపిస్తున్నాయంటే ఆ ఊరిలో నీటి వనరులు సమృద్ధిగా ఉన్నట్లు.. పంటలు బాగా పండుతున్నట్లు భావిస్తారు. పంట చేలల్లో రైతులను ఇబ్బంది పెట్టే క్రిమికీటకాలను తింటూ ఎంతో మేలు చేస్తాయి. ఇంట్లో క్రిమికీటకాలు కనిపించాయంటే గుటుక్కున మింగేసి వాటిబారి నుంచి మనల్ని కాపాడతాయి. జీవ వైవిధ్యానికి ప్రతీకగా ఉండే పిచ్చుకల సంఖ్య నేడు గణనీయంగా తగ్గింది. ఈ క్రమంలో పిచ్చుకల జాతి పరిరక్షణకు ప్రపంచ వ్యాప్తంగా 2010 నుంచి ఏటా మార్చి 20న ‘ప్రపంచ పిచ్చుకల దినోత్సవం’ నిర్వహిస్తూ వాటి మనుగడ ఆవశ్యకతపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారు. ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
అనంతపురం కల్చరల్: ఒకప్పుడు ఊర పిచ్చుకలు లేని ఊరులేదంటే అతిశయోక్తి కాదు. గ్రామీణ ప్రాంతాల్లో ఏ వాడ చూసినా, ఏ ఇల్లు చూసినా గుంపులు గుంపులుగా ఊరపిచ్చుకలు కనిపించేవి. మిగతా పక్షులకు భిన్నంగా ఊర పిచ్చుకలు, మానవులు ఒకే కుటుంబసభ్యులుగా కలిసి పోయేవారు. గుప్పెడు గింజలు వేస్తే చాలు కలకాలం తోడుండే పిచ్చుకలు నేడు వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, రేడియేషన్, శబ్ద కాలుష్యాల దెబ్బకు ఎక్కడికక్కడ రాలిపోతున్నాయి. దీంతో పర్యావరణాన్ని కాపాడే పిచ్చుకల జాతి సంరక్షణకు ప్రత్యేకంగా నడుం బిగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
అంతరించిపోతున్న సంప్రదాయం
ఇంట్లో పిచ్చుకలు గూడు కట్టుకుంటే శుభం జరుగుతుందని పూర్వీకులు భావించి, వాటిని మురిపెంగా పిలుస్తూ ధాన్యాలను వెదజల్లేవారు. ఇళ్లు, ప్రార్థనా మందిరాల్లో పావురాలు, పిచ్చుకలు యథేచ్ఛగా సంచరించేవి. ఇప్పుడవన్నీ భూతద్దం పెట్టి వెతికినా కానరావు. రోజురోజుకూ పెరిగిపోతున్న మానవుడి స్వార్థం కారణంగా పచ్చని చెట్లు, చల్లటి వాతావరణం కనుమరుగవుతోంది. జిల్లాలో పంటల సాగులో రసాయనిక మందుల వినియోగం పెరిగిపోవడం కూడా పక్షి జాతి అంతరించేందుకు కారణమవుతోంది. ముఖ్యంగా సెల్‌ఫోన్ల వాడకం పెరిగిపోయే కొద్దీ పిచ్చుకల జాతి క్రమంగా అంతరించిపోతూ వస్తోంది. నానాటికీ తగ్గుతున్న పర్యావరణ సమతుల్యత పక్షి జాతిని నేటి తరానికి దూరం చేస్తోంది. ఇలాంటి తరుణంలో పిచ్చుకల సంరక్షణకు మేము సైతం అంటూ పలువురు ముందుకొస్తున్నారు. కృత్రిమ గూళ్లను ఉచితంగా అందిస్తున్నారు. మలమల మాడ్చేస్తున్న వేసవి నుంచి కాపాడుకునేందుకు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పలు చోట్ల నీటి తొట్టెలను ఏర్పాటు చేశారు.
ఊరంతా పిచ్చుక గూళ్లు
ఊర పిచ్చుకలకు మిగిలిన పక్షులకు చాలా తేడా ఉంటుంది. ఊర పిచ్చుకలు మనుషులతో సన్నిహితంగా మెలుగుతాయి. దీంతో ఒకప్పుడు ఊరంతా పిచ్చుక గూళ్లు కనిపించేవి. ఆహారం కోసం, నివాసం కోసం పూర్తిగా మానవులపై ఆధారపడతాయి. పొలాల్లో ఎగురుతూ పంట నష్టాలకు కారణమైన క్రిమికీటకాలను ఆరగిస్తాయి. పిచ్చుక చిన్నదే అయినా దాని ఉనికిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక జీవన విధానం పిచ్చుకల మనుగడకు ప్రతిబంధకం కారాదని పక్షి ప్రేమికులు అంటున్నారు. పిచ్చుకల సంరక్షణకు అనంతపురానికి చెందిన సామాజిక సేవా కార్యకర్త ఏజే అనిల్‌కుమార్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా 1.40 లక్షల కృత్రిమ గూళ్లను ఇంటింటికి అందించి, పిచ్చుకల పునరుత్పత్తికి దోహదపడేలా చర్యలు తీసుకున్నారు. పిచ్చుకల విషయంలో ఆయన తీసుకున్న శ్రద్ధ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో అనంత ఖ్యాతిని పతాక స్థాయిలో మెరిసేలా చేసింది. పర్యావరణానికి దోహదపడే పిచ్చుకలను సంరక్షించుకోవడం అందరి బాధ్యత అని, ఆ దిశగా అందరూ ప్రయాణం సాగించాలని అనిల్‌కుమార్‌రెడ్డి పిలుపునిస్తున్నారు.
సందర్భం
నేడు ప్రపంచ
పిచ్చుకల
దినోత్సవం

ఊర పిచ్చుక.. ఊరికే అందం