
కళింగరతో జాగ్రత్త
అనంతపురం అగ్రికల్చర్: ‘‘మండు టెండ నుంచి ఉపశమనం పొందేందుకు ఎర్రగా కనిపిస్తూ నిగనిగలాడుతున్న కళింగర (పుచ్చకాయ), కర్భూజాలాంటివి తింటున్నారా? అయితే ముందు మీ ఆరోగ్యగం గురించి కూడా కొంచెం ఆలోచించండి’ అంటూ జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు (95812 75717) ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఇటీవల కల్తీ, నాసిరకంతో పాటు విషపూరితమైన రసాయన మందులతో మాగబెట్టిన పండ్లు బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తున్నారన్నారు. ఇందులో కళింగర కూడా ఉందన్నారు. మరీ ముఖ్యంగా వేసవి దాహాన్ని తీర్చుకునేందుకు బహిరంగ మార్కెట్‌లో కుప్పలు కుప్పలుగా పోసి అమ్ముతున్న కళింగర కాయ సహజమైన రంగా లేదంటే కృత్రిమ రసాయనాలు కలిపిన పండా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు.
● పక్వానికి రాని కళింగరలను, ఎర్ర రంగు రాని వాటికి సిరంజిల ద్వారా కృత్రిమ రసాయనాలను ఎక్కిస్తున్నారు. రసాయనాలు ఎక్కించిన కాయ లోపలి భాగం మామూలు కన్నా మరీ ఎర్రగా ఉంటుందన్నారు. లేదంటే నిర్ధిష్ట గడువు కంటే ముందుగానే మాగడం జరిగి ఉంటుందన్నారు. దీని వల్ల సహజంగా లభించే పోషకాలు అందక, అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందన్నారు.
● సహజంగా పండిన కాయలో మృదువైన ఎరుపు లేదా గులాబీరంగు ఉంటుంది. అదే రసాయనాలు కలిపిన వాటిలో డార్క్ రెడ్, బ్లడ్ రెడ్ రంగులో ఉంటాయి. అంతేకాక ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కళింగర కాయ కోసి ముక్కలు నీటిలో వేస్తే నీరు ఎరుపు రంగులోకి మారితే రసాయనాలు కలిపినట్లుగా నిర్ధారించుకోవచ్చు. అలాగే కాయ తిన్న తర్వాత చేతులకు ఎరుపు రంగు అంటి, అది తుడిచినా అలాగే ఉంటే రసాయనాలు కలిపినట్లు గుర్తించాలి. సహజంగా పండిన పుచ్చకాయ తీపిగా తేలికగా ఉంటుంది. కృత్రిమ రంగు వేసినది కొంచెం చేదు రుచి వస్తుంది.
● పుచ్చకాయ పైభాగం పచ్చగా ఉండాలి, మెరుస్తూ ఉండకూడదు. తక్కువ గ్రీన్ కలర్ ఉన్నదే మంచిదని గుర్తించాలి. కాయ నేలపై ఉండే భాగం పసుపు రంగులో ఉండాలి. అలాగే ఆకారంలో గుండ్రంగానూ, సమంగానూ ఉంటే మంచిది. ఎడమొడిగా ఉంటే బాగా లేదని అర్థం. కండ పట్టిన భాగం పచ్చగా ఉంటే ఇంకా పక్వానికి రాలేదని గుర్తు. పొడిగా, గోధుమ రంగులో ఉంటే పండిందని తెలుసుకోవాలి. కట్ చేసిన కాయ గాఢ ఎరువు రంగులో ఉండకూడదు.
● రసాయనాలు కలిపిన పుచ్చకాయను తినడం వల్ల అలర్జీ, డయేరియా బారిన పడటమే కాకుండా దీర్ఘకాలంలో కాలేయం, కిడ్నీల సమస్య తలెత్తవచ్చు. క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలపై ఎక్కువ ప్రభావం ఉంటుంది.
రసాయనాలు వాడి ఎర్రగా ఆకర్షణీయంగా మార్చేస్తున్న దుస్థితి

కళింగరతో జాగ్రత్త

కళింగరతో జాగ్రత్త
Comments
Please login to add a commentAdd a comment