
తల్లి అంత్యక్రియలకు వెళితే.. ఇల్లు దోచేశారు
తాడిపత్రి: తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లిన కుమార్తె ఇంటిని దుండగులు దోచేశారు. తాడిపత్రి మండలం బందార్లపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన మేరకు... రెండు రోజుల క్రితం తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లి వద్ద ఆటో బోల్తా పడిన ఘటనలో తాడిపత్రిలోని భగత్‌సింగ్ నగర్‌కు చెందిన రసూల్‌బీ అనంతపురంలో చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాద విషయం తెలియగానే ఆమె కుమార్తె షేక్ హనీఫా ఇంటికి తాళం వేసి తన భర్తతో కలసి మంగళవారం రాత్రి అనంతపురంలోని సర్వజనాస్పత్రికి చేరుకుంది. బుధవారం తల్లి మృతదేహాన్ని తాడిపత్రికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం కుమార్తె హనీఫా తన స్వగ్రామం బందార్లపల్లికి చేరుకుంది. అప్పటికే ఇంటి తాళం పగులగొట్టి ఉండడం గమనించిన ఆమె ఆందోళనతో లోపలకు వెళ్లి పరిశీలించింది. బీరువాలోని బంగారు నెక్లెస్, లాంగ్ చైన్, కమ్మలు, కొంత నగదు చోరీకి గురైనట్లు గుర్తించి సమాచారం ఇవ్వడంతో తాడిపత్రి రూరల్ సీఐ శివగంగాధర్‌రెడ్డి, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.