ఐసీడీఎస్.. అస్తవ్యస్తం
సాక్షి, పుట్టపర్తి
ఆరేళ్లలోపు చిన్నారులు, బాలింతలు, గర్భిణుల సంక్షేమం కోసం సర్కారు ఏర్పాటు చేసిన ఐసీడీఎస్ (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్) విభాగంలో పాలన అస్తవ్యస్తంగా మారింది. కూటమి సర్కారు అధికారం చేపట్టిన తర్వాత ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అధికార పార్టీ నాయకుల మాట వినకుంటే బదిలీ బహుమానంగా ఇస్తున్నారు. చిన్నారులకు గుడ్లు, పండ్లు, కూరగాయలు పంపిణీ చేసే కాంట్రాక్టర్ల నుంచి అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల నియామకాల వరకు కూటమి నేతలదే పెత్తనం. కూటమి నేతల సూచన మేరకు పని చేస్తేనే కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. ఒక వేళ వారు చెప్పినట్లు తల ఆడించినా...ఉన్నతాధికారుల నుంచి వేటు తప్పదు. ఈక్రమంలో జిల్లా ఐసీడీఎస్ పీడీగా రావాలంటే అధికారులు జంకుతున్నారు. గడిచిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నూతనంగా జిల్లా ఏర్పడిన నాటి నుంచి కూటమి ప్రభుత్వం వచ్చే వరకు ఒకరే పీడీగా ఉన్నారు. అప్పట్లో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేవారు. కేవలం అర్హత ఆధారంగా నియామకాలు చేపట్టేవారు. ఫలితంగా ఎవరికీ ఇబ్బంది ఉండేది కాదు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. దీంతో ఉండలేక చాలామంది పీడీలు స్వచ్ఛందంగా తమ స్థానాలకు వెళ్లిపోతున్నారు.
ఆ ఒక్క పదవీ విరమణతో..
జిల్లా ఏర్పాటు నాటి నుంచి ఐసీడీఎస్ పీడీగా ఉన్న లక్ష్మీకుమారి గతేడాది జూలై 31వ తేదీన పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత మడకశిర సీడీపీఓగా ఉన్న నాగమల్లీశ్వరి ఇన్‌చార్జ్ పీడీగా వచ్చారు. సుమారు రెండున్నర నెలల పాటు ఆమె విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో ఐసీడీఎస్‌లో పలు కాంట్రాక్ట్‌లకు టెండర్లు పిలిచారు. ఏం జరిగిందో తెలిసే లోపు.. ఆమె తిరిగి మడకశిర సీడీపీఓగా వెళ్లిపోయారు. ఆ తర్వాత ఇన్‌చార్జ్ పీడీగా ఓడీ చెరువు సీడీపీఓగా ఉన్న సుధావరలక్ష్మి బాధ్యతలు తీసుకున్నారు. ఆమె హయాంలో అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల నియామకాలు జరిగాయి. ఆ తర్వాత ఉన్నఫలంగా ఈనెల 17వ తేదీన కొత్త పీడీని నియమించారు. దీంతో ఆమె తిరిగి ఓడీ చెరువు సీడీపీఓగా వెళ్లిపోయారు.
డైరెక్టరేట్ నుంచి వచ్చిన పీడీ..
జిల్లా ఐసీడీఎస్‌లో చోటు చేసుకుంటున్న నాటకీయ పరిణామాల కారణంగా.. నేరుగా డైరెక్టరేట్ నుంచి నియామకాలు చేపట్టారు. ఈ క్రమంలోనే గుంటూరులో పని చేసే శ్రీదేవిని.. శ్రీసత్యసాయి జిల్లా ఐసీడీఎస్ పీడీగా నియమించారు. ఈనెల 17వ తేదీన ఆమె బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆమె ముందు పలు సవాళ్లు ఉన్నాయి. అన్నీ చక్కబెడతారా? లేక సర్దుకుంటారా? అనేది చర్చనీయంగా మారింది.
నియామకాల్లో చేతివాటం!
అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల నియామకాల్లో కూటమి నేతల సూచన మేరకు ఉద్యోగాలు ఇచ్చినా.. కొందరు సిండికేటుగా మారి ఆయా గ్రామ స్థాయి నాయకులతో కుమ్మకై ్క భారీగా చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వానికి.. అధికారికి చెడ్డపేరు రాకముందే మార్పులు చేస్తున్నారని సమచారం. దందా చేయడం.. చేయించడం.. తర్వాత బదిలీపై వెళ్లిపోవడం.. ఇంకొకరు రావడం.. ఐసీడీఎస్‌లో ఆర్నెల్లుగా జరుగుతున్న తీరు ఇదే.
నెలల వ్యవధిలోనే మారిపోతోన్న పీడీలు
కూటమి నేతల ఒత్తిళ్లతో
దందా చేయడం.. వెళ్లిపోవడం
అంగన్‌వాడీల నియామకాలు,
బదిలీల్లో భారీగా చేతివాటం
కొనసాగితే ఇబ్బందులు తప్పవని తెలిసి తప్పిస్తున్న నాయకులు
ఫిర్యాదు చేయండి
ఐసీడీఎస్‌లో ఎలాంటి అవినీతికి తావు లేదు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయండి. విచారణ చేయించి నేరం రుజువైతే చర్యలకు ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తాం. ఏ రాజకీయ పార్టీకి ప్రాధాన్యం ఉండదు. ప్రభుత్వ నిబంధనల మేరకు నియామకాలు, పాలన ఉంటుంది. – శ్రీదేవి, ఐసీడీఎస్ పీడీ,
శ్రీసత్యసాయి జిల్లా
ఐసీడీఎస్.. అస్తవ్యస్తం
Comments
Please login to add a commentAdd a comment