హిందూపురం అర్బన్: క్షణికావేశంలో తప్పుచేసి జైలుకు వచ్చిన ఖైదీలందరూ బయటకు వెళ్లిన తరువాత సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా న్యాయాధికారి సంస్థ కార్యదర్శి శివప్రసాద్ సూచించారు. గురువారం స్థానిక ఉపకారాగారాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించారు. జైలులో ఉన్న ఖైదీల వివరాలను జైలు సూపరింటెండెంట్ హనుమన్నను అడిగి తెలుసుకొన్నారు. అనంతరం కారాగార గదులు, నిత్యావసర సరకుల నాణ్యత పరిశీలించారు. ఖైదీలతో నేరుగా మాట్లాడారు. ఏ కేసుల్లో జైలుకు వచ్చారు? ఎప్పటి నుంచి ఉంటున్నారు? మీకు న్యాయవాదులు ఉన్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక సమస్యలతో న్యాయవాదులను ఏర్పాటు చేసుకోలేని వారు దరఖాస్తు చేసుకొంటే న్యాయవాదులను ఏర్పాటు చేస్తామన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్, న్యాయవాదులు సిద్ధు, సదాశివరెడ్డి, సంతోషికుమారి, మురళి, అంజినమ్మ, లోక్ అదాలత్ సిబ్బంది హేమావతి, శారద పాల్గొన్నారు.
ధర్మవరం అర్బన్: పట్టణంలోని సబ్‌జైలును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.శివప్రసాద్‌యాదవ్ గురువారం తనిఖీ చేశారు. సబ్‌జైలులోని వంట గది, స్టోర్ రూం, బ్యారక్‌లను తనిఖీ చేశారు. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఖైదీలకు అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. సబ్‌జైలు సూపరింటెండెంట్ కెవీ బ్రహ్మంరెడ్డి, న్యాయవాదులు బాలసుందరి, నూర్ మహమ్మద్, పారా లీగల్ వలంటీర్ షామీర్‌బాషా, సబ్‌జైలు సిబ్బంది పాల్గొన్నారు.