అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు శనివారం జరగనున్నాయి. స్థాయీ సంఘం–1, 2, 4, 7 (ఆర్థిక, ప్రణాళిక/ గ్రామీణాభివృద్ధి/ విద్య, వైద్యం/ పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ శాఖల) సమావేశాలు ప్రధాన సమావేశ మందిరంలో జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన నిర్వహించనున్నారు. స్థాయీ సంఘం–3, 5, 6 (వ్యవసాయం/ ఐసీడీఎస్/ సాంఘిక సంక్షేమ శాఖలు) సమావేశాలు ఆయా సంఘాల చైర్‌పర్సన్ల అధ్యక్షతన జెడ్పీ అదనపు భవన్‌లో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సీఈఓ రాజోలి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో పూర్తి చేశారు. సమావేశాలకు సంబంధించి సభ్యులతో పాటు ఆయా శాఖల అధికారులకు ఇది వరకే సమాచారం అందించారు. అయితే ఈసారి జరిగే సమావేశాలు వాడీవేడిగా జరగనున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ప్రధానంగా సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పీహెచ్‌సీ వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండడం లేదు. అనంతపురం అర్బన్ ప్రాజెక్టులో ఓ అంగన్‌వాడీ టీచర్ విధులకు హాజరుకాకుండా ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న విషయం ఆధారాలతో సహా తేలినా ఇంతవరకూ చర్యలు తీసుకోలేదు. సామాజిక భద్రత పింఛన్లలో కోతలు, రేషన్ సరుకులను డీలర్లు సక్రమంగా పంపిణీ చేయకపోవడం తదితర సమస్యలు ఉన్నాయి. గృహనిర్మాణ శాఖలో ఉద్యోగుల పనితీరు, అవినీతి ఆరోపణలు ఉన్నాయి. తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికలు రూపొందించడంలో అధికారులు విఫలమయ్యారు. ఈ సమస్యలన్నింటిపై సభ్యులు గళం విప్పనున్నారు. వాడీవేడీగా జరిగే అవకాశం ఉందని ముందే పసిగట్టిన స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పరిస్థితులపై ఆరా తీసినట్లు తెలిసింది.
ప్రధాన సమస్యలపై నిలదీయనున్న సభ్యులు