● పదో తరగతి పరీక్షల విధుల్లో
అలసత్వానికి ఫలితం
పుట్టపర్తి: పదో తరగతి పరీక్షల విధుల్లో అలసత్వం వహించిన ముగ్గురు ఇన్విజిలేటర్లు సస్పెండ్ అయ్యారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా సోమవారం గణితం పరీక్ష నిర్వహించారు. పరీక్షల రాష్ట్ర పరిశీలకుడు, ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రత్యేకాధికారి సుబ్బారావు కదిరి నియోజకవర్గంలో పర్యటించి 10 కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన కదిరి బాలికల ఉన్నత పాఠశాల ఇన్విజిలేటర్లు రుద్రమరెడ్డి, డి.కృష్ణప్పను సస్పెండ్ చేయాలని డీఈఓను ఆదేశించగా...ఆయన ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. అలాగే ముదిగుబ్బ బాలికల ఉన్నత పాఠశాలలో ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థి మాస్ కాపీయింగ్ చేస్తూ స్క్వాడ్‌కు దొరికిపోయాడు. దీంతో సదరు విద్యార్థిని డీబార్ చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థి మాస్‌కాపీయింగ్ చేస్తున్నా.. ఎలాంటి చర్యలు తీసుకోని ఇన్విజిలేటర్ మహమ్మద్ రఫీని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు డీఈఓ కృష్ణప్ప తెలిపారు. అంతేకాకుండా సదరు పరీక్ష కేంద్రంలోని చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లను విధుల నుంచి తప్పించి వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. వారి స్థానంలో కొత్త వారిని నియమించామని వెల్లడింతారు.
పరీక్షకు 145 మంది విద్యార్థుల గైర్హాజరు
సోమవారం జరిగిన పదో తరగతి గణితం పరీక్షకు 145 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈఓ కృష్ణప్ప తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 104 కేంద్రాల్లో సోమవారం గణితం పరీక్షకు 21,629 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 21,484 మంది మాత్రమే హాజరయ్యారన్నారు. మరో 145 మంది గైర్హాజరయ్యారని డీఈఓ వివరించారు.
108.5 హెక్టార్లలో
ఉద్యాన పంటలకు నష్టం
పుట్టపర్తి అర్బన్: అకాల వర్షాలతో జిల్లాలో 108.5 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం జరిగినట్లు జిల్లా ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22న అకాలవర్షంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. దీంతో రెవెన్యూ, ఉద్యానశాఖ సిబ్బంది ఆయా గ్రామాల్లో పర్యటించి పంటనష్టంపై ప్రాథమిక అంచనా రూపొందించినట్లు వెల్లడించారు. ఇందులో తాడిమర్రి మండలంలోని దాడితోట, ముదిగుబ్బ మండలంలోని కొడవాండ్లపల్లి, కొండగుట్టపల్లి ,మర్తాడు గ్రామాల్లో సుమారు 115 మంది రైతులకు చెందిన 108.5 హెక్టార్లలో అరటి తోటలు నేలకొరిగినట్లు గుర్తించామన్నారు. పంటనష్టానికి సంబంధించినన నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు.
29లోపు ఈ–కేవైసీ
చేయించుకోవాలి
ప్రశాంతి నిలయం: జిల్లాలోని రేషన్ కార్డుదారులందరూ ఈ నెల 29వ తేదీలోపు ఈ–కేవైసీ చేయించుకోవాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ సూచించారు. ఈమేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ–కేవైసీ పూర్తి చేసుకోని వారికి రేషన్ సరుకులు అందే అవకాశం లేదన్నారు. జిల్లాలోని 5 లక్షలకుపైగా ఉన్న రేషన్‌కార్డుల్లో 16,89,531 మంది సభ్యులుగా ఉన్నారన్నారు. వారిలో ఇప్పటి వరకు 15,17,689 మంది ఈ–కేవైసీ పూర్తి చేసుకున్నారని, ఇంకా 1,71,842 మంది ఈ–కేవైసీ చేయించుకోవాల్సి ఉందన్నారు. వారంతా వెంటనే గ్రామ/వార్డు సచివాలయాలు, మొబైల్ యాప్, రేషన్ షాపుల్లోని ఈ–పాస్ పరికరాల ద్వారా ఈ–కేవైసీ ఆప్‌డేట్ చేయించుకోవాలన్నారు. ఐదేళ్లలోపు పిల్లలు మినహా కార్డుల్లో పేర్లున్న వారంతా ఈ–కేవైసీ పూర్తి చేయించుకోవాలని జేసీ సూచించారు.
ఖాద్రీశుడి హుండీ ఆదాయం
రూ.82.64 లక్షలు
కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామికి భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలను సోమవారం లెక్కించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిగిన 15 రోజులకు గానూ హుండీల ద్వారా రూ.82,64,892 నగదు, 12 గ్రాముల బంగారం, 302 గ్రాముల వెండి వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వెండిదండి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అలాగే 21 అమెరికా డాలర్లు, 20 కెనడా, 20 ఆస్ట్రేలియా డాలర్లు, 7 ఓమన్ రియాల్ వచ్చినట్లు వెల్లడించారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది ఆదాయం పెరిగిందన్నారు. కార్యక్రమంలో హుండీల పర్యవేక్షణాధికారి ఎన్.ప్రసాద్, కెనరా బ్యాంక్ మేనేజర్ అనంతబాబు, బ్యాంక్ సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.