ధర్మవరం: నెలరోజులైనా తాగునీరు సరఫరా చేయని మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ధర్మవరంలో ప్రజలు ఆందోళనకు దిగారు. ఎల్–4 కాలనీకి చెందిన మహిళలు సోమవారం ఎన్‌ఎస్ గేటుకు వెళ్లే ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో రాస్తారోకో చేశారు. దీంతో రెండు గంటలకుపైగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ... తమ కాలనీకి రెండు నెలలుగా తాగునీరు సరఫరా చేయడం లేదని, మున్సిపల్ డీఈకి పలుమార్లు ఫోన్‌లు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లే తప్పనిసరి పరిస్థితుల్లో తామంతా రోడ్డెక్కాల్సి వచ్చిందన్నారు. తమ కాలనీకి తాగునీరు అందించేదాకా ఆందోళన కొనసాగిస్తామన్నారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు అక్కడికి చేరుకుని మహిళలకు సర్ది చెప్పారు. వెంటనే తాగునీరు సరఫరా చేస్తామని చెప్పడంతో వారు రాస్తారోకోను విరమించారు.