ధర్మవరం రూరల్: ఎస్టీలైనా సరే కరెంటు బిల్లులు చెల్లించాల్సిందేనని, లేకపోతే విద్యుత్ సర్వీసు వైర్లను తొలగిస్తామని విద్యుత్ శాఖ అధికారులు మండలంలోని ధర్మపురి కాలనీ వాసులను హెచ్చరించారు. అంతేకాకుండా పోలీసులను రంగంలోకి దించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
బకాయిల పేరుతో భయపెడుతూ...
ధర్మవరం మండలం ధర్మపురి గ్రామంలోని ఎస్టీ కాలనీకి మంగళవారం విద్యుత్ శాఖ అధికారులు వెళ్లారు. కాలనీకి చెందిన 40 మంది విద్యుత్ బకాయిలు ఉన్నారని, వెంటనే చెల్లించకపోతే సర్వీసులు తొలగిస్తామన్నారు. దీంతో ఎస్టీలంతా అధికారులతో వాగ్వాదం చేశారు. ప్రభుత్వం ఎస్టీలకు ఉచిత కరెంటు ఇస్తుంటే...మీరొచ్చి బిల్లులు చెల్లించాలని బెదిరించడం అన్యాయమన్నారు. ఈక్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా, విద్యుత్ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ధర్మవరం రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని కాలనీ వాసులకు సర్ది చెప్పారు. ఈ విషయమై విద్యుత్ శాఖ ఏఈ జానకి రామయ్య మాట్లాడుతూ.. ఎస్టీ కాలనీలోని 40 మంది సర్వీసులపై రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకు బిల్లులు బకాయి ఉన్నాయన్నారు. ప్రభుత్వం 200 యూనిట్ల వరకు మాత్రమే ఉచితంగా విద్యుత్ ఇస్తుందన్నారు. ఆ తర్వాత బిల్లు వేస్తుందన్నారు. ఈ క్రమంలోనే వేలకు వేలు బిల్లులు పెండింగ్‌లో ఉన్న వారితో బిల్లులు వసూలు చేయాలని తమకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. అనంతరం అధికారులతో చర్చల తర్వాత ఏప్రిల్ 10వ తేదీలోపు కొంత మొత్తం చెల్లిస్తామని గిరిజనులు చెప్పడంతో విద్యుత్ శాఖ అధికారులు వెళ్లిపోయారు. కాగా, మొదటి నుంచి ప్రభుత్వమే ఎస్టీలకు ఉచిత విద్యుత్ ఇస్తుండగా...తాము బకాయి ఎందుకు ఉన్నామో అర్థం కావడం లేదని పలువురు వాపోయారు.
ధర్మపురి ఎస్టీ కాలనీ వాసులతో విద్యుత్ శాఖ అధికారుల వాగ్వాదం