పుట్టపర్తి అర్బన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోజురోజుకూ పనిభారం పెరిగిపోతుండడంతో గ్రామ పంచాయతీల కార్యదర్శులు సతమతమవుతున్నారు. ఆస్తి పన్ను వసూళ్లు, సర్వేలు, రోజు వారీ విధులు, పారిశుధ్య నిర్వహణ వంటి పనులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక సమీక్షల పేరుతో గంటల తరబడి జూమ్ మీటింగ్‌లు, తరచూ నిర్వహించే సమావేశాలతో రోజూ నిర్వహించే పనులు చతికిలబడుతున్నాయి. అధికారులు ఇచ్చిన లక్ష్యాలను చేరుకోకపోవడంతో నిత్యం ఏదో ఒక పంచాయతీ కార్యదర్శికి మెమోలు అందుతున్నాయి.
సర్వేలతో ముప్పుతిప్పలు..
జిల్లాలో 457 గ్రామ పంచాయతీలు ఉండగా దాదాపు అన్ని పంచాయతీల్లో కార్యదర్శులు ఉన్నారు. నిత్యం పంచాయతీలకు వెళ్లి సంతకాలు చేసిన అనంతరం రోజు వారీ విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆస్తి పన్ను వసూలు చేయడానికి గతంలో బిల్ కలెక్టర్ ఉండేవారు. ప్రస్తుతం ఈ విధులు కూడా పంచాయతీ కార్యదర్శులే నిర్వర్తిస్తున్నారు. నెలలో మొదటి రెండు మూడు రోజులు పింఛన్లను ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేయాలి. మిగిలిన మొత్తాలను సెర్ప్‌కు పంపాల్సి ఉంటుంది. ప్రజలు అడిగిన పంచాయతీ పనులను ఠంచన్‌గా చేసిపెట్టాలి. లేదంటే వారి నుంచి వ్యతిరేకతను చవిచూడాల్సి వస్తుంది. సిటిజన్ సర్వే, మిస్సింగ్ ఎంప్లాయీస్ సర్వే, పీ4 సర్వే, విలేజ్ సర్వేలను కార్యదర్శులకు అప్పగించారు. ట్యాంక్ క్లీనింగ్, క్లోరినేషన్, స్వర్ణాంధ్ర–స్వచ్చాంద్ర కార్యక్రమాలు, డంపింగ్ యార్డుల నిర్వహణ, చెత్తతో సంపద తయారీ, నీటి సమస్యలు, రికార్డుల నిర్వహణ, సర్టిఫికెట్ల జారీ, సచివాలయ సిబ్బందితో పనులు చేయించడం, లీజు వసూళ్లు, వేలం పాటలు, పిల్లల మిస్సింగ్ ఆధార్ సర్వే, డెత్ రీ వెరిఫికేషన్ సర్వే తదితర సర్వేలతో ముప్పుతిప్పలు పడుతున్నారు.
పస్తులతో విధుల నిర్వహణ..
ప్రభుత్వ నిర్దేశిత సర్వేల కోసం సెలవు దినాల్లోనూ కార్యదర్శులు పనిచేయాల్సి వస్తోంది. లేదంటే నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయలేక అధికారులతో చీవాట్లు తినాల్సి వస్తుంది. సర్వే సమయంలో ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో పనిచేసే కార్యదర్శులు నెట్‌వర్క్ సమస్యతో ఒకే ఇంటి వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. దీంతో సకాలంలో భోజనాలు కూడా చేయలేక పస్తులతోనే పూట గడపాల్సి వస్తోంది. ప్రతి సోమవారం మండల కార్యాలయాలతో పాటు కలెక్టరేట్‌లో అందే ఫిర్యాదులను పరిష్కరించడానికి క్షేత్రస్థాయి పర్యటనలు తప్పనిసరిగా చేయాల్సి ఉంది. అక్కడ ఇరువర్గాల వాగ్వాదంతో సమస్య జఠిలమై మరింత ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. దీంతో పాటు కలెక్టరేట్‌కు ప్రతి సోమవారం అర్జీలు ఇచ్చేందుకు వచ్చేవారికి సేవలు చేయడానికి వారానికి కొందరు చొప్పున విధులో పాల్గొనాల్సి వస్తోంది.
సర్దుకుపోండి..
గతంలో నాయకులకు, కార్యకర్తలకు సిబ్బందిపై గౌరవం ఉండేది. రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పాటైన తర్వాత పంచాయతీ కార్యదర్శుల విధులు అడకత్తెరలో పోకచెక్కలా మారాయి. సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్నా నాయకుల ఒత్తిళ్లతో అధికారుల చివాట్లు తినాల్సి వస్తోంది. దీంతో తమ సమస్యను తొలి విడతలో ఆయా మండలాల ఎంపీడీఓల దృష్టికి కార్యదర్శులు తీసుకెళ్లారు. దీనిపై తామేమీ చేయలేమంటూ ఎంపీడీఓలు చేతులెత్తయడంతో పాటు సర్దుకుపోవాలంటూ ఉచిత సలహా ఇస్తుండడం గమనార్హం. దీంతో ఇటీవల జేసీ అభిషేక్‌కుమార్‌ను కలసి తమ గోడు వెల్లబోసుకున్నారు. పని ఒత్తిడితో కుటుంబసభ్యులు, పిల్లలతో సరదాగా గడ లేక పోతున్నట్లు వాపోయారు.
ఆస్తి పన్ను వసూళ్లు, సర్వేలతో పాటు గ్రీవెన్స్ సమస్యలతో సతమతం
లక్ష్యాలు పూర్తి కాకపోతే
ఎంపీడీఓలతో చివాట్లు
పనిభారం తగ్గించాలంటూ
కార్యదర్శుల గగ్గోలు
సర్వేలతో సతమతం
ప్రభుత్వం నిర్దేశించిన సర్వేలతో తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో లేకుండా ఇంటింటికీ తిరగాల్సి వస్తోంది. కొన్ని సర్వేలకు ప్రజల నుంచి ఓటీపీలు తీసుకోవాలి. ఆ సమయంలో చాలా మంది ఓటీపీలు చెప్పడం లేదు. దీంతో సమస్య మరింత జఠిలమవుతోంది. మా బాధలు వర్ణానాతీతం.
– రామ్మోహన్, ఏపీ గ్రామ కార్యదర్శుల
సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్
పని భారం పెరిగింది
పంచాయతీ పరిధిలో ప్రతి పనినీ కార్యదర్శులకు అప్పగిస్తున్నారు. దీంతో పని భారం పెరిగింది. సుమారు 35 రకాలకు పైగా సేవలందిస్తున్నాం. అటవీ ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్యతో మరింత ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పని పూర్తి కాకపోతే షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేయాల్సి ఉంటుంది. – ఓంప్రసాద్,
ఏపీ పంచాయతీ కార్యదర్శుల పబ్లిసిటీ సెక్రటరీ
పని భారం.. తాళలేం!
పని భారం.. తాళలేం!
పని భారం.. తాళలేం!