వెండర్ల ముసుగులో నిధులకు సర్కార్‌ టెండర్‌ | - | Sakshi
Sakshi News home page

వెండర్ల ముసుగులో నిధులకు సర్కార్‌ టెండర్‌

Published Wed, Mar 19 2025 12:40 AM | Last Updated on Wed, Mar 19 2025 12:39 AM

వెండర

వెండర్ల ముసుగులో నిధులకు సర్కార్‌ టెండర్‌

స్థానిక సంస్థల ప్రతినిధులను డమ్మీలుగా మార్చేశారు.. టెండర్లు పిలవకుండానే పనులు కట్టబెడుతున్నారు.. వెండర్స్‌ ముసుగులో సొంత పార్టీ కార్యకర్తలకు ప్రజాధనం దోచి పెడుతున్నారు.. సర్పంచ్‌లు, ఎంపీటీసీలను గౌరవిస్తామని చెప్పి.. వారికి అధికారమన్నదే లేకుండా చేస్తున్నారు.. వెరసి కూటమి నేతలు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారు. దీంతో తమ హక్కులు, గౌరవం కోసం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పోరాడాల్సి వస్తోంది.

కూటమి ప్రభుత్వం తీరుపై స్థానిక సంస్థల ప్రతినిధుల నిరసన

అడ్డగోలుగా మెటీరియల్‌ కాంపోనెంట్‌ పనుల కేటాయింపు

రాజ్యాంగానికి తూట్లు పొడిచిన పాలకులు

వెండర్స్‌ ముసుగులో రూ. 700కోట్ల మేర టీడీపీ నేతలకు పంపకాలు

టెండర్లు పిలవకుండానే పనుల అప్పగింత

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను డమ్మీ చేసి పచ్చ చొక్కాలు వేసుకున్న నాయకులకు పనులు అప్పగించడంపై నాయకులు మండిపడుతున్నారు. సభలు, సమావేశాల్లో గట్టిగా నిలదీస్తున్నారు. పంచాయతీ సమావేశాలను బహిష్కరిస్తున్నారు. మండల పరిషత్‌ సమావేశాలను వాకౌట్‌ చేస్తున్నారు. ఎక్కడికక్కడ అధికారులకు ఫిర్యాదు చేయడమే కాకుండా కలెక్టర్‌ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసి, నిరసనలు కూడా చేస్తున్నారు.. ఎన్ని చేసినా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాజ్యాంగానికి విరుద్ధంగా, పంచాయతీరాజ్‌ చట్టాలకు భిన్నంగా ప్రభుత్వం అనుసరించిన తీరుపై ఉమ్మడి జిల్లాలోని లక్ష్మీపురం, మునకలవలస, గుల్లపాడు తదితర పంచాయతీలు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు కూడా ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న పనుల్లో కనీసం 50శాతానికి తక్కువగా కాకుండా పనులు గ్రామ పంచాయతీల ద్వారా చేపట్టాలని తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ తీర్పులు పట్టించుకోకుండా టీడీపీ నాయకులు, కార్యకర్తల జేబులు నింపేందుకు కూటమి ప్రభుత్వం అడ్డదారిలోనే వెళ్తోంది. కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తానొక ప్రత్యేకమని చెప్పుకుంటున్న పవన్‌ కళ్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీరాజ్‌ శాఖలో జరుగుతున్న అప్రజాస్వామిక విధానమేంటో కళ్లకు కట్టినట్టు స్పష్టమవుతోంది. కానీ దీనిపై తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

కూటమి ప్రభుత్వం స్థానిక నేతలను అవమానిస్తోంది. వారితో పని లేదన్నట్టు వ్యవహరిస్తోంది. దీంతో స్థానిక సంస్థల నాయకులు స్థానికంగా ఆందోళనలతో మొదలుపెట్టి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. 2014–19 సమయంలో టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి, ఆ సభ్యులతోనే పనులన్నీ చేయించింది. ఇప్పుడా జన్మభూమి కమిటీ స్థానంలో వెండర్స్‌ అనే కొత్త పేరుతో టీడీపీ నాయకులను రంగంలోకి దించింది. ముందుగా గ్రామాల వారీగా వెండర్స్‌గా ఆ పార్టీ నాయకుల పేర్లు రిజిస్ట్రేషన్‌ చేసి, ఆ వెండర్స్‌ రూపంలో ఉన్న నాయకులతో గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కాంపోనెంట్‌ పనులను చేయిస్తోంది. ఆ మధ్య రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి గ్రామసభలు పెట్టి రికార్డు సృష్టించామని ప్రజల్ని మభ్యపెట్టిన కూటమి ప్రభుత్వం.. ఆ రోజు సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో తీర్మానాలు చేసి, పని అయ్యాక వారందరినీ పక్కన పెట్టేసి వెండర్స్‌ ముసుగులో టీడీపీ నాయకులకు ఏకపక్షంగా పనులు కట్టబెట్టేసింది. వాస్తవంగా మెటీరియల్‌ను సరఫరా చేసేవాళ్లని వెండర్స్‌ అంటారు. కానీ, కూటమి ప్రభుత్వం దానికి కొత్త భాష్యం చెప్పింది. వెండర్స్‌ అంటే కాంట్రాక్టర్స్‌ అన్నట్టుగా పనులు చేయించుకునిపోతోంది.

చట్టంతో మాకేంటి పని..!

రాజ్యాంగంలో పేర్కొన్న ప్రకారం పంచాయతీలో చేపట్టే పనులను ఆయా పాలకవర్గాలే చేపట్టాలి. ముఖ్యంగా పంచాయతీరాజ్‌ చట్టం సెక్షన్‌ 16లో 5వ ఉప అంశం ప్రకారం గ్రామ పంచాయతీ వెచ్చించే నిధుల్లో 50శాతం పనులు పంచాయతీల ద్వారా చేపట్టాలి. కానీ అందుకు భిన్నంగా ఇక్కడ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను పక్కన పెట్టి వెండర్స్‌తో పనులు చేయిస్తున్నారు. గ్రామ పంచాయతీలతో సంబంధం లేకుండా ఎంపీడీఓలు డైరెక్ట్‌గా వెండర్స్‌ రిజిస్ట్రేషన్‌ చేయించి, ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కాంపోనెంట్‌ పనులు చేయిస్తున్నారు. అలాగే పంచాయతీ తీర్మానం లేకుండా చేపట్టే పనులకు చట్టబద్ధత కూడా ఉండదు. కానీ, కూటమి ప్రభుత్వంలో అదేమీ పాటించడం లేదు. జిల్లాలో పంచాయతీరాజ్‌, గిరిజన సంక్షేమ శాఖ, సమగ్ర శిక్ష అభియాన్‌, రోడ్లు భవనాల శాఖల ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులతో పనులకు శ్రీకారం చుట్టింది. వాస్తవంగా ఈ నిధులేమీ రాష్ట్ర ప్రభుత్వానివి కావు. ఉపాధి హామీ పథకం కింద వచ్చిన నిధుల్లో 60శాతం వేతనాల రూపంలో ఖర్చు పెట్టాల్సి ఉండగా, మిగతా 40శాతం నిధులను మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద నిర్దేశిత అభివృద్ధి పనులు చేపట్టాలి. అంటే కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, తదితర ఇంజినీరింగ్‌ పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఈ లెక్కన జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద వచ్చిన నిధుల్లో 40శాతం మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద రూ. 699.57కోట్లతో 5310పనులు మంజూరు చేసింది. ఇవన్నీ పంచాయతీల తీర్మానాల ద్వారా, పాలక వర్గాలు చేపట్టాలి.

నేతలకు పంచి పెట్టిన పనులు..

నిబంధనలకు విరుద్ధంగా పంచాయతీలతో చేప

హక్కులు కాలరాసి, రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కిన కూటమి ప్రభుత్వం తీరుకు నిరసనగా ఇటీవల నందిగాం మండల పరిషత్‌ సమావేశాన్ని వాకౌట్‌ చేసి వెళ్లిపోతున్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు

ట్టాల్సిన పనులను టీడీపీ నేతలకు పప్పుబెల్లాల్లా పంచిపెట్టేసింది. టెండర్లు పిలిచి, పనులు చేయించాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా ఆ పార్టీ నాయకులకు వెండర్స్‌ ముసుగులో ఏకపక్షంగా కేటాయించేసింది.

పర్యవేక్షక అధికారులు కూడా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో రూ. 183 కోట్ల పనులు చేసేసినట్టు రికార్డుల్లో చూపించేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
వెండర్ల ముసుగులో నిధులకు సర్కార్‌ టెండర్‌1
1/1

వెండర్ల ముసుగులో నిధులకు సర్కార్‌ టెండర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement