కంచిలి: మండలంలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన వివిధ రకాల పనుల్లో జరిగిన అక్రమాలు బయటపడ్డాయి. స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద గత ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులకు సంబంధించి జనవరి 30 నుంచి ఫిబ్రవరి 18వ తేదీ వరకు 31 పంచాయతీల పరిధిలో సోషల్ ఆడిట్ నిర్వహించారు. చివరిగా బుధవారం ఈ నివేదికలు వెల్లడించే ప్రజావేదిక కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా 31 పంచాయతీల పరిధిలో ఏడాదిపాటు చేపట్టిన వివిధ రకాల పనులకు సంబంధించి నాణ్యత, కొలతలు, వేతనదారులకు అందిన బిల్లులు, హాజరు పట్టిక పరిశీలన, రశీదుల పంపిణీ తదితర అంశాలను క్షేత్రస్థాయిలో సోషల్ ఆడిట్ సిబ్బంది సేకరించిన వివరాలను నివేదించారు.
అవకతవకలు బయటకు
ఏడాది కాలంలో ఉపాధి హామీ, హౌసింగ్, ఐటీడీఏ, పంచాయతీరాజ్, ఆర్‌వీఎం విభాగాల్లో మొత్తంగా 1,783 పనులు చేపట్టారు. వీటికి సంబంధించి సోషల్ ఆడిట్ చేపట్టిన నేపథ్యంలో జరిగిన అవకతవకలు బయటకు వచ్చాయి. దీంతో ఉపాధి హామీ సిబ్బంది నుంచి రూ.64,446లు రికవరీకి అధికారులు ఆదేశించడంతో పాటు రూ.38,500లు జరిమానాగా విధించారు. మొత్తంగా రూ.1,01,946లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. పంచాయతీలవారీగా సోషల్ ఆడిట్ నివేదికలు చదివిన సందర్భంగా చాలా వరకు పంచాయతీల పరిధిలో ఉపాధిహామీ పనులు చేపట్టినచోట కనీసం మస్టర్లలో హాజరు కూడా సక్రమంగా వేయడం లేదని, వేతనదారుల బిల్స్‌కు సంబంధించి రశీదు పత్రాలు పంపిణీ చేయలేదని పేర్కొన్నారు. హాజరు పట్టికలో సంతకాలు, వేలిముద్రలు కూడా లేవని సోషల్ ఆడిట్ డీఆర్పీలు నివేదించారు. అంతేకాకుండా మెటీరియల్ కాంపొనెంట్ పనులకు సంబంధించి పూర్తిగా చేపట్టని నిర్మాణాలకు సైతం బిల్లులు విడుదల చేసినట్లు తెలిపారు. ఉపాధి హామీ పనుల కొలతల్లో కూడా తేడాలు ఉన్నట్లు తెలిపారు. ఇలా అడుగడుగునా పర్యవేక్షణ లోపం, పనుల్లో డొల్లతనం అనేవి ఈ ప్రజావేదిక సాక్షిగా వెల్లడయ్యాయి. సమావేశంలో డ్వామా పీడీ సుధాకరరావు, స్థానిక ఎంపీపీ పైల దేవదాస్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు ఇప్పిలి లోలాక్షి, ఏపీడీ సీహెచ్ శ్రీనివాసరెడ్డి, ఎంపీడీవో వి.తిరుమలరావు, విజిలెన్స్ డీవో స్వరూపారాణి, ఏపీడీ పంచాది రాధ, విజిలెన్స్ అధికారి శ్రావణ్, ఏపీవో జి.ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.
రూ.64,446ల రికవరీకి అధికారుల ఆదేశం
రూ.38,500ల జరిమానా విధింపు