ఫిర్యాదు చేసినా..
అదనపు పరిహారం అందలేదని కలెక్టర్ స్పందనలో ఫిర్యాదు చేశాం. ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అయినా అదనపు పరిహారం అందలేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించిన అదనపు పరిహారం అందించి న్యాయం చేయాలి. – చింతాడ దమయంతి,
శ్రీహరిపురం, ఆమదాలవలస మండలం
రాజకీయ కారణాలతోనే..
కొందరు అధికారులు, సిబ్బంది తీరు కారణంగా ఇంతవరకు పరిహారం అందలేదు. రాజకీయ కారణాలతోనే జాప్యం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా పరిహారం అందలేదు. – పొలం శ్రీనివాసరావు, గాజులకొల్లివలస, ఆమదాలవలస మండలం
అన్యాయం..
నిర్వాసిత కాలనీకి భూములు అందజేసిన బాధితులకు అదనపు పరిహారం ప్రకటించినా రెవెన్యూ సిబ్బంది వివరాలు తప్పుగా నమోదు చేయటం వల్ల ఇంతవకు పరిహారం అందలేదు. భూములు కోల్పోయి రోడ్డున పడ్డ బాధితులను ఇప్పటికై నా ఆదుకోవాలి. – లంక అప్పలరాజు, గాజులకొల్లివలస,
ఆమదాలవలస మండలం
ఆమదాలవలస రూరల్: కొంతమంది అధికారుల నిర్లక్ష్యం.. భూములు అందజేసిన రైతుల పాలిట శాపంగా మారింది. తమ తోటి రైతులు అదనపు పరిహారం అందుకున్నా తమకు మాత్రం అందకపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈ విషయమై కార్యాలయాలు, అధికారుల చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణాలు చేస్తున్నా కాలయాపన చేస్తున్నారు తప్ప న్యాయం చేయడం లేదని వాపోతున్నారు. తరతరాలుగా పచ్చని పంటలు పండించే భూములు ఎంతో ఉదారతమైన ఆశయంతో ప్రభుత్వానికి అప్పగిస్తే తమకు ఇలా చేస్తారా అంటూ మండిపడుతున్నారు. వంశధార రెండో దశ నిర్వాశితుల కాలనీ కోసం భూములు అందించిన పలువురు రైతులకు అదనపు పరిహారం అందక కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
హిరమండలం రిజర్వాయర్ కోసం తులగాం గ్రామంలో సర్వం కోల్పోయిన బాధితుల కోసం ప్రభుత్వం ఇళ్లు నిర్మించేందుకు ఆమదాలవలస మండలం గాజులకొల్లివలస గ్రామంలో సంగమేశ్వర ఆలయం వద్ద సుమారు 115 ఏకరాలు భూమిని గుర్తించారు. ఇందులో రైతుల వద్ద నుంచి సుమారు 100 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఒక్కో బాధిత కుటుంబానికి ఐదు సెంట్ల స్థలంలో ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఈ కాలనీ కోసం భూములు ఇచ్చిన రైతులకు రూ.5,25,000 పరిహారం కింద 2009లో అప్పటి ప్రభుత్వం అందజేసింది. అయితే ఈ పరిహారం ఏ మాత్రం చాలకపోవటంతో 2022లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఎకరాకి రూ.1,00,000 చొప్పున అదనపు పరిహారం అందించాలని నిర్ణయించారు.దీ మేరకు రైతుల ఖాతాల్లో జమ చేశారు.
అధికారుల నిర్వాకం..
అధికారులు చేసిన తప్పులు కారణంగా సుమారు 30 మంది బాధిత రైతులు అదనపు పరిహారానికి నోచుకోలేకపోయారు. రెవెన్యూ శాఖ నుంచి భూసేకరణ శాఖకు పంపాల్సిన బాధితుల జాబితాలో బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐ.ఎఫ్.ఎస్‌సి.కోడ్, ఆధార్ నంబర్ వంటివి తప్పుగా నమోదు చేయటంతో బాధితులకు ఇంతవరకు అదనపు పరిహారం అందని ద్రాక్షగానే మిగులుతోంది. ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు న్యాయం జరగలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
న్యాయం చేస్తాం..
ఈ విషయమై ఆమదాలవలస తహశీల్దార్ ఎం.రాంబాబు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా.. అదనపు పరిహారం విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. బాధితులకు తగిన న్యాయం చేస్తామని చెప్పారు.
వంశధార నిర్వాసిత కాలనీకి భూములు ఇచ్చిన రైతులకు తప్పని ఎదురుచూపులు
అధికారుల నిర్వాకం కారణంగా అదనపు పరిహారానికి నోచుకోని వైనం
న్యాయం చేయాలని వేడుకుంటున్న బాధిత రైతులు
అందరికీ అందని అధనం
అందరికీ అందని అధనం
అందరికీ అందని అధనం