సరుబుజ్జిలి: ఆదివాసీ హక్కుల పరిరక్షణకు కలిసికట్టుగా ఉద్యమం చేయాలని కేఎన్‌పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య, పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు పి.దానేష్ పిలుపునిచ్చారు. గురువారం థర్మల్ ప్లాంట్ ప్రతిపాదిత గ్రామాలైన వెన్నెలవలస, మసానుపుట్టి, జంగాలపాడు గిరిజన ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పచ్చని పంట పొలాల్లో థర్మల్‌ప్లాంట్ నిర్మించడం వల్ల భూములు బీడుగా మారే ప్రమాదముందని చెప్పారు. కూటమి నేతలు స్వప్రయోజనాల కోసమే థర్మల్ ప్లాంట్ ప్రతిపాదన ముందుకు తెచ్చారని ఆరోపించారు. కార్యక్రమంలో థర్మల్ పోరాట కమిటీ నేత సవర సింహాచలం, పీడీఎం రాష్ట్ర నేత పాలిన వీరాస్వామి, ఉద్యమనేతలు, సురేష్‌దొర, ధర్మారావు, దుర్యోధన, వంకల మాధవరావు, గణేష్, గంగయ్య, వైకుంఠరావు, రామానాయుడు, నాగమణి, కోటి పాల్గొన్నారు.
క్రికెట్ బెట్టింగ్‌పై ఎస్పీ ఆరా
నరసన్నపేట: ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి నరసన్నపేట పోలీసు స్టేషన్‌ను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సుమారు మూడు గంటలు స్టేషన్‌లో ఉండి పోలీసులు పనితీరు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. నరసన్నపేటలో జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్‌లపై ఆరా తీశారు. పెండింగ్ కేసుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈవీఎం గోదాముల తనిఖీ
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాములను త్రైమాసిక తనిఖీలలో భాగంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవీఎంల భద్రత పరంగా ఎలాంటి లోపాలు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈవీఎంలను ట్రిపుల్ లాక్ సిస్టమ్ ద్వారా భద్రపరిచామని, 24 గంటల సీసీటీవీ నిఘా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు రౌతు శంకరరావు, పీఎంజే బాబు, సురేష్‌బాబుసింగ్, ఎం.గోవింద్, బి.అర్జున్‌కుమార్, సీహెచ్ భాస్కరరావు, కె.వి.ఎల్.ఎస్.ఈశ్వరి పాల్గొన్నారు.