ఇచ్ఛాపురం రూరల్: పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులను సకాలంలో పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లి, తీసుకురావడంలో ప్రత్యేక శ్రద్ధ వహించిన ఆర్టీసీ ఉద్యోగుల్ని ఉపాధ్యాయులు సత్కరించారు. మండలం కొళిగాం ఉన్నత పాఠశాలకు చెందిన 102 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు మండపల్లి ఉన్నత పాఠశాలను పరీక్ష కేంద్రంగా విద్యాశాఖ కేటాయించింది. సుమారు పది కిలో మీటర్లు దూ రం కావడంతో ఆర్టీసీ బస్సును విద్యార్థులకు కేటాంచారు. ఆరు రోజుల పాటు విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా సర్వీసు చేసిన పలాస ఆర్టీసీ డిపో డ్రైవర్ పి.పోలారావు, కండక్టర్‌లు కై లాష్,శ్రీనివాస్‌లను శుక్రవారం కొళిగాం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ ఘనంగా సత్కరించింది. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నరేంద్రనాద్ పట్నాయక్, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ అధ్యక్షుడు శ్రీకాంత్ మహంతీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.