10 మంది టీచర్లపై సస్పెన్షన్లు ఎత్తివేత | - | Sakshi
Sakshi News home page

10 మంది టీచర్లపై సస్పెన్షన్లు ఎత్తివేత

Published Sat, Mar 29 2025 12:46 AM | Last Updated on Sat, Mar 29 2025 12:42 AM

శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో సంచలనం సృష్టించిన కుప్పిలి మోడల్‌ స్కూల్‌ మాస్‌ కాపీయింగ్‌ ఘటనలో పది మందిపై సస్పెన్షన్లు ఎత్తివేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన వారి సస్పెన్షన్లు తాత్కాలికంగా హోల్డ్‌లో ఉంచారు. వారిపై ఆధారాలు బలంగా ఉండటం, క్రిమినల్‌ కేసులు నమోదు కావడంతో కొద్దిరోజులు జాప్యం జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. వారం రోజులుగా టీచర్ల సస్పెన్షన్లను రద్దుచేయాలని, వి ద్యార్థులకు న్యాయం చేయాలని, డీఈఓపై చర్యలు తీసుకోవాలని నినదిస్తూ ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి వేదిక తరఫున పోరాటాలు జరిగాయి. ఏప్రిల్‌ 3 నుంచి జరిగే టెన్త్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌ను కూడా బాయ్‌కాట్‌ చేస్తామని హెచ్చరించారు. దీంతో ప్రభుత్వం దిగి రాక తప్పలేదు. ప్రభుత్వ పెద్దల వరకు ఈ పంచాయితీ చేరడంతో.. విద్యాశాఖ మంత్రి లోకేష్‌ సూచనలతో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ చొరవ తీసుకున్నారు. తనను కలిసిన ఉపాధ్యాయ జేఏసీ నాయకులతో మాట్లాడారు. ఆర్జేడీ బి.విజయభాస్కర్‌, డీఈఓ తిరుమల చైతన్యలతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం మొదలుపెట్టారు. శుక్రవారం ఆర్జేడీ విజయబాబు జిల్లా డీఈఓ కార్యాలయానికి వచ్చి వాస్తవ ఘటనపై వివరాలు రాబట్టారు. ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ముఖ్య ప్రతినిధులతో మాట్లాడారు. సస్పెండైన 15 మందిలో ముగ్గురు హెచ్‌ఎంలు, ఏడుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్ల్లు ఎత్తివేస్తున్నట్టు సంబంధిత అధికారులు ఉత్తర్వులు వెలువరించారు. వారి నుంచి లిఖితపూర్వక వివరణ తీసుకుని విధుల్లోకి తీసుకుంటున్నట్టు మార్గదర్శకాలు జారీ చేశారు.

కుప్పిలి మాస్‌ కాపీయింగ్‌ ఘటనలో ‘యూ టర్న్‌’ ముగ్గురు హెచ్‌ఎంలు, ఏడుగురు టీచర్లను విధుల్లోకి తీసుకుంటున్నట్టు ఉత్తర్వులు

మరో ఐదుగురి సస్పెన్షన్లను తాత్కాలికంగా హోల్డ్‌లో ఉంచిన అధికారులు

ఆర్జేడీతో చర్చలు విఫలం

శ్రీకాకుళం న్యూకాలనీ: ‘కుప్పిలి పంచాయితీ’కి ఫుల్‌స్టాప్‌ పడుతుందని ఆశించిన ఉపాధ్యాయులకు నిరాశే ఎదురైంది. పాఠశాల విద్య ఆర్జేడీ బి.విజయభాస్కర్‌ పిలుపు మేరకు శుక్రవారం రాత్రి ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి వేదిక ప్రతినిధులు డీఈఓ కార్యాలయంలో చర్చలకు హాజరు కాగా.. వీరి మధ్య సయోధ్య కుదరలేదు. దీంతో చర్చలు విఫలమయ్యాయి. మిగిలిన ఉపాధ్యాయులపై స స్పెన్షన్లు ఎత్తివేయాలని, డీఈఓను తొలగించాలని, కోర్టు కేసులు వెనక్కి తీసుకోవాలని, డీబారైన విద్యార్థులకు రీ ఎగ్జామ్‌నిర్వహించాలని కోరగా.. ఆర్‌జేడీ ఒప్పుకోలేదు. దీంతో శనివారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించతలపెట్టిన జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ముట్టడి యథాతథంగా జరుగుతుందని తెలిపారు.

‘డీఈఓపై చర్యలు చేపట్టండి’

కుప్పిలి కాపీయింగ్‌ ఉదంతంలో అన్యాయంగా సస్పెన్షన్‌కు గురైన ఉపాధ్యాయులకు, డీబారైన విద్యార్థులకు న్యాయం చేసి, డీఈఓపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి వేదిక ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తమ కార్యచరణ ఉద్యమ షెడ్యూల్‌లో భాగంగా శుక్రవారం ఎమ్మెల్యేలకు ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి వేదిక ప్రతినిధులు వినతిపత్రాలను అందజేశారు. శ్రీకాకుళంలో ఎమ్మెల్యేలు గొండు శంకర్‌, బగ్గు రమణమూర్తిలకు వినతిపత్రాలు అందజేశారు.

‘విద్యార్థులకు న్యాయం చేయాలి’

కుప్పిలిలో డీబార్‌కు గురైన విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు శుక్రవారం డీఈఓ కార్యాలయంలో సమీక్షా సమావేశానికి హాజరైన ఆర్జేడీ బి.విజయ్‌భాస్కర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement