శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ తగదని, పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీఓ 77 రద్దు చేయాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందల నాసర్‌జి, సహాయ కార్యదర్శి నాగభూషణం డిమాండ్ చేశారు. శ్రీకాకుళం క్రాంతిభవన్‌లో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌ను రద్దు చేసి ఏ యూనివర్సిటీకి సంబంధించిన ప్రవేశ పరీక్ష ఆ వర్సిటీయే నిర్వహించేలా మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. వైద్యవిద్యను పేదలకు దూరం చేసేలా జీవో 107, 108లను రద్దు చేయాలని కోరారు. సంఘ జిల్లా కార్యదర్శి సీహెచ్ మాట్లాడుతూ వర్సిటీల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘ జిల్లా సహాయ కార్యదర్శి జి.హరిప్రసాద్, నాయకులు కూర్మా, ఈశ్వరరావు, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.