
మంచినీళ్లపేటకు చెందిన ఇద్దరు మత్స్యకారులు గల్లంతు
అసలే అమావాస్య రోజులు. సంద్రంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉండే వేకువ సమయం. చుట్టూ చీకటి తప్ప ఇంకేమీ లేని వేళలో వారు వేటకు పూనుకున్నారు. కానీ రాకాసి అలలు విరుచుకుపడడంతో తెప్పతో సహా నలుగురు చెల్లాచెదురైపోయారు. ఇద్దరు బతుకుజీవుడా అంటూ తీరానికి చేరుకున్నారు. మరో ఇద్దరు మాత్రం తిరిగి రాలేకపోయారు. మత్స్యకారులు, మైరెన్ పోలీసులు కలిపి వెతికినా ఎక్కడా వారి ఆచూకీ దొరకలేదు.
వజ్రపుకొత్తూరు:
మండలంలోని నువ్వలరేవు కొత్త జెట్టీ సమీపంలో మంగళవారం తెల్లవారు జామున సముద్రంలో ఫైబర్ తెప్ప బోల్తా పడిన సంఘటనలో మంచినీళ్లపేట గ్రామానికి చెందిన వంక కృష్ణ(44), బుంగ ధనరాజు( 45) గల్లంతయ్యారు. అదే తెప్పలో ఉన్న మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు బుంగ కోటేశ్వరరావు, చింతల వెంకటేశ్వరరావు అతి కష్టం మీద ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నారు. దీంతో మంచినీళ్లపేటలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ సంఘటనలో ఫైబర్ తెప్ప, ఇంజిన్, వలలు పాడై దాదాపు రూ.2.50 లక్షలు మేర నష్టం వాటిల్లింది. స్థానిక మత్స్యకారులు, మైరెన్, స్థానిక పోలీసులు తీరంలో తీవ్రంగా గాలిస్తున్నప్పటికీ గల్లంతైనవారి ఆచూకీ లభ్యం కాలేదు. స్థానిక మత్స్యకారులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మంచినీళ్లపేటకు చెందిన వంక కృష్ణ, బుంగ ధనరాజు, కోటేశ్వరరావు, చింతల వెంకటేశ్వరరావు కలిసి మంగళవారం తెల్లవారుజామున నువ్వలరేవు జెట్టీ సమీపం నుంచి వేటకు బయల్దేరారు. ఫైబర్ తెప్పను సంద్రంలోకి తీసుకెళ్లే క్రమంలో ఎత్తైన రాకాసి అలలు ఒక్కసారిగా తెప్పపై విరుచుకుపడడంతో నలుగురూ చెల్లాచెదురైపోయారు. ఇందులో కెరటాలకు ఎదురొడ్డి నిలిచిన బుంగ కోటేశ్వరరావు, చింత వెంకటేశ్వరరావు ప్రాణాలతో బయటపడగా గల్లంతైన వంక కృష్ణ, బుంగ ధనరాజుల ఆచూకీ మాత్రం దొరకలేదు.
వంక కృష్ణకు భార్య ఎల్లమ్మతో పాటు ఇద్దరు కుమారులు 13 ఏళ్ల సుమంత్, 8 ఏళ్ల సాయి ఉండగా.. బుంగ ధనరాజుకు భార్య కృష్ణవేణి ఎనిమిదేళ్ల ప్రణీత, నాలుగు నెలల పసికందు సోనియా ఉన్నా రు. వారి రోదనలు స్థానికులకు కంటతడి పెట్టించాయి. వైస్ ఎంపీపీ వంక రాజు, మాజీ సర్పంచ్ గుళ్ల చిన్నారావు, జి.శంభూరావు, గ్రామ పెద్దలు ఇచ్చి సమాచారం మేరకు విషయం తెలుసుకున్న మత్స్యశాఖ ఎఫ్‌డీఓ ధర్మరాజు పాత్రో, మైరెన్ సీఐ డి.రాము, స్థానిక సీఐ, ఎస్‌ఐలు తిరుపతి, బి.నిహా ర్ సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించా రు. వివరాలు సేకరించి స్థానిక మత్స్యకారులతో కలిసి గల్లంతైన మత్స్యకారుల కోసం అటు గంగవరం నుంచి ఇటు ఒడిశా తీరం గోపాల్‌పూర్ వర కు తీరం వెంబడి విస్తృతంగా గాలించారు. ప్రత్యేక చాపర్ ద్వారా కూడా గాలించారు. బుధవారం నాటికి సమాచారం పూర్తిగా తెలుస్తుందని మత్స్యకారులు చెబుతున్నారు. వంక కృష్ణ భార్య ఎల్లమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ బి.నిహార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నువ్వలరేవు జెట్టీ వద్ద ఫైబర్ తెప్ప బోల్తా
క్షేమంగా ఒడ్డుకు చేరిన మరో ఇద్దరు జాలర్లు
తీరం వెంబడి విస్తృతంగా గాలింపు

మంచినీళ్లపేటకు చెందిన ఇద్దరు మత్స్యకారులు గల్లంతు

మంచినీళ్లపేటకు చెందిన ఇద్దరు మత్స్యకారులు గల్లంతు

మంచినీళ్లపేటకు చెందిన ఇద్దరు మత్స్యకారులు గల్లంతు

మంచినీళ్లపేటకు చెందిన ఇద్దరు మత్స్యకారులు గల్లంతు