
గడువు తీరిన మందులను చట్టబద్ధంగా కాల్చుతాం
శ్రీకాకుళం క్రైమ్ : గడువు తీరిన మందులను ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అనుమతి పొందిన బయోవేస్ట్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో చట్టబద్ధంగా కాల్చుతామని జిల్లా డ్రగ్ ఏడీ చంద్రరావు అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఇదివరకు ఏవైనా గడువు తీరిన (ఎకై ్స్పరీ) మందులు కొన్నింటికి కంపెనీలు రిటర్న్ పాలసీ కింద డబ్బులు చెల్లించేవని, మరికొన్నింటికి పాలసీ లేకపోవడంతో సంబంధిత ఫార్మా, జనరిక్, పీసీడీ డి స్ట్రిబ్యూటర్స్ బహిరంగ ప్రదేశాల్లో కుప్పలుగా పెట్టి కాల్చేయడమో.. లేదంటే పూడ్చేయడమో చేసేవారన్నారు. ఇలా చేయడం వల్ల పర్యావరణానికి, మా నవ మనుగడకి ప్రమాదమని అన్నారు. తాజాగా జిల్లాలోని లావేరులో ఉన్న రెయిన్‌బో ఇండస్ట్రీస్‌తో ఒప్పందం అయ్యిందని, బయో వేస్ట్ వెహికల్‌లో అక్కడికి తీసుకెళ్లి కాల్చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తొలిసారి మన జిల్లాలోనే ఈ ప్రక్రియ మొదలు పెట్టామని, త్వరలోనే డిస్ట్రిబ్యూటర్స్, మందుల దుకాణాల వారితో సమావేశంలో అంతా వివరిస్తామన్నారు. రెయిన్‌బో ఇండస్ట్రీస్ ప్రతినిధులు, జిల్లా డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.