
దేవుడి మీదే భారం
ఆయనకు కుటుంబం, శివుడు తప్ప మరెవరూ లేరు. నిత్యం శివారాధన తప్ప మరేమీ తెలీదు. ఏళ్ల తరబడి ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నా సెంటు భూమి కొనలేకపోయారు. చిల్లిగవ్వ కూడా వెనకేసుకోలేకపోయారు. ఇప్పుడు ఆపత్కాలంలో ఆర్థిక స్థోమత చాలక ఆపసోపాలు పడుతున్నారు. భర్తకు సాయం చేయడం తప్ప మరేమీ తెలీని ఆ ఇల్లాలు ఇప్పుడు కూలి పనికి వెళ్లి పిల్లల కడుపు నింపుతున్నారు. మెదడుకు శస్త్ర చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితుల్లో.. దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
పొందూరు: మండలంలోని మలకాం గ్రామానికి చెందిన విభూది నీలకంఠం శివాలయంలో అర్చకునిగా పనిచేసేవారు. అదే ఆయనకు జీవనోపాధి. సెంటు భూమి కూడా లేదు. ఆయనకు భార్య సరస్వతి, పిల్లలు ధనలక్ష్మి, హరినాథ రావు ఉన్నారు. భక్తులు ఇచ్చే దక్షిణలు, రేషన్ బియ్యంతో కుటుంబ పోషణ జరిగేది. ఏడాది కిందట నీలకంఠం మల కాం గ్రామానికి పక్కనే ఉన్న పైడాయవలసలోని శివాలయానికి పూజలు చేసేందుకు వెళ్తుండగా అనుకోని ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి వాహనంతో ఢీకొట్టడంతో పంట పొలాల్లో పడిపోయారు. సుమారు గంట సమయం పాటు స్పృహలో లేరు. అటుగా వెళ్తున్న వారు ఆయనను గుర్తించారు. కాళ్లు, చేతులకు వైద్య సేవలందించి ఇంటికి అప్పగించారు. అయితే తలకు కనపడని గాయం ఏర్పడిన విషయం తెలియలేదు. నెలలు గడుస్తుంటే ఒకే మాటను పది సార్లు చెప్పడం, మనుషులను గుర్తించలేకపోవడం, పనిలో శ్రద్ధ తగ్గిపోవడం వంటివి కనిపించాయి. దీంతో పలు ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు చేయించారు. మందులు వాడారు. చాలా నెలల తర్వాత మెదడులో రక్తం గడ్డం కట్టిందని గుర్తించారు. ఇటీవలే రాగోలు ఆస్పత్రిలో తలకు ఆపరేషన్ చేయించారు. సుమారు రూ.లక్ష 50 వేల వరకు అప్పుల పాలయ్యారు. ఈ అప్పు తీర్చేందుకు అర్చకుడి భార్య కూలి పనులకు వెళ్తున్నారు. అయినా ఆ కుటుంబానికి ఇప్పుడు పూట గడవడం లేదు. చాలా దయనీయమైన పరిస్థితిలోకి వెళ్లిపోయారు.
ఇలాంటి దశలో ఇప్పుడు ఆయనకు మరో పెద్ద ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పూట గడవడానికే ఇబ్బంది పడుతున్న దశలో మరోసారి ఆపరేషన్ ఎలా చేయించాలో తెలీక వారు సతమతమవుతున్నారు. పిల్లలకు ఒక పూట తిండి పెడితే మరో పూట పెట్టలేని పరిస్థితిలో భార్య ఉంది. భర్త పూర్తిగా పడుకుని ఉండడమే తప్ప మరేమీ చేయలేకపోతున్నారు. శివాలయంలో పూజారిగా ఉండటంతో ప్రజలు అప్పుడప్పుడు కొంత సాయం చేస్తున్నారు. ఆపరేషన్ చేయించాలంటే దాతల సాయం ఒక్కటే మార్గమని వారు కోరుతున్నారు. ఎంత ఖర్చవుతుందన్న విషయాన్ని డాక్టర్లు ఇంకా స్పష్టం చేయలేదు. దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు.
ప్రాణాపాయ స్థితిలో ఆలయ అర్చకుడు
తలకు ఆపరేషన్ కోసం సరిపోని ఆర్థిక స్థోమత
ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు

దేవుడి మీదే భారం

దేవుడి మీదే భారం