
యాంత్రీకరణతో రైతులకు ప్రయోజనం
కంచిలి: వ్యవసాయ యాంత్రీకరణ విధానంతో రైతులకు చక్కని ప్రయోజనాలు కలుగుతాయని కేంద్ర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. మండల కేంద్రంలో గల వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డు ఆవరణలో వ్యవసాయ యంత్ర పనిముట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ఆదివారం చేపట్టారు. ఇందులో నియోజకవర్గంలోని నాలుగు మండలాల రైతులకు 236 వ్యవసాయ యంత్రాలను రూ.37.02 లక్షలు విలువ చేసినవి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్‌తో కలిసి పంపిణీ చేశారు. సబ్సిడీ ధరలకు వీటిని రైతులకు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సోంపేట వ్యవసాయ సహాయ సంచాలకులు పి.జగన్మోహనరావు, మండల వ్యవసాయాధికారి బి.ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.