
ప్రైవేటులో పేదలకు ఉచిత విద్య
నరసన్నపేట: ప్రైవేటు విద్యా సంస్థల్లో నిరుపేదలు ఉచితంగా చదువుకునే సౌలభ్యాన్ని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కల్పించింది. విద్యా హక్కు చట్టం–2009, సెక్షన్ 12(1)(సీ) ప్రకారం ప్రైవేటు స్కూల్స్‌లో పేదల పిల్లలు కూడా చదువుకునేందుకు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా 2023 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు 2025–26 విద్యా సంవత్సరానికి 1వ తరగతిలో ఉచిత ప్రవేశాల కు అడ్మిషన్లకు ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంట్లో భాగంగా ఈ నెల 28 నుంచి దరఖాస్తులు చేసుకోవ డానికి అవకాశం కల్పించారు. మే నెల 15 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉచిత పథకంలో 2023లో 1120 మంది, 2024 విద్యా సంవత్సరంలో 1127 మంది విద్యార్థులు జిల్లాలో అడ్మిషన్లు పొందారు. ఒకటో తరగతిలో చేరే విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజు చెల్లిస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు 25 శాతం పేద విద్యార్థులకు సీట్లు కేటాయించాలి.
ఏ వర్గానికి ఎంత శాతమంటే..
● ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొటున్న వర్గాల(అనాథ పిల్లలు, హెచ్‌ఐవీ బాధితులు, దివ్యాంగులు) విద్యార్థులకు 5 శాతం సీట్లు కేటాయిస్తారు.
● షెడ్యూల్ కులాలకు 10 శాతం, షెడ్యూల్ తెగలకు 4 శాతం సీట్లు ఇస్తారు.
● బలహీన వర్గాలకు చెందిన బీసీ, మైనారిటీ, గ్రామీణప్రాంతాల్లో కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ. 1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం రూ. 1.44 లక్షలకు మించకుండా ఉన్న పిల్లలకు 6 శాతం సీట్లు కేటాయిస్తారు.
దరఖాస్తుదారులు ఇవ్వాల్సిన డాక్యుమెంట్లు..
● ప్రస్తుత చిరునామా ధ్రువీకరణ కోసం తల్లిదండ్రుల ఆధార్‌కార్డు/ ఓటు కార్డు/ రేషన్ కార్డు/ భూమి యాజమాన్య పత్రం/ఉపాధి హామీ జాబ్ కార్డు/పాస్‌పోర్టు/ డ్రైవింగ్ లైసెన్స్/విద్యుత్ బిల్లు/ రెంటల్ ఎగ్రిమెంట్(ఇంటి అద్దె) కాపీ మూడింటిని సమర్పించాలి.
● పిల్లల వయసు ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి
ఆన్‌లైన్ వెబ్‌సైట్..
● డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సీఎస్‌ఈ.ఏపీ.జీఓవి.ఇన్ ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్ సమర్పించాలి.
● 28–04–2025 నుంచి 15–05–2025 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు.
● దరఖాస్తులు దగ్గర్లో ఉన్న సచివాలయాలు, మీ సవా కేంద్రాలు/ఇంటర్‌నెట్, మండల విద్యాశాఖధికారి కార్యాలయాల్లోనూ చేసుకోవచ్చు.
అవకాశం సద్వినియోగం చేసుకోవాలి
విద్యా హక్కు చట్టం అనుసరించి గత ప్రభుత్వం ఈ అవకాశాన్ని పేద విద్యార్థులకు కల్పించింది. దీన్ని ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. పేద వర్గాల పిల్లలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.
– పి.దాలినాయుడు, ఎంఈఓ నరసన్నపేట
ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం విద్యార్థులకు ఉచిత విద్య
ఈ నెల 28 నుంచి మే 15 వరకు దరఖాస్తులకు అవకాశం
అనాథలు, హెచ్‌ఐవీ బాధితులు, దివ్యాంగులకు ప్రాధాన్యం
అర్హత వయసు..
సీబీఎస్‌ఈ/ఐసీఎస్‌ఈ/ఐబీ సిలబస్‌ను అనుసరిస్తున్న పాఠశాలల్లో ప్రవేశం కోసం ఏప్రిల్ 2, 2019 నుంచి మార్చి 31, 2020 మధ్య జన్మించి ఐదేళ్ల వయసు నిండి ఉండాలి.
స్టేట్ సిలబస్‌ను అనుసరిస్తున్న పాఠశాలల్లో ప్రవేశం కోసం జూన్ 2,2019 నుంచి మే 31, 2020 మధ్య జన్మించి 5 ఏళ్ల వయసు నిండి ఉండాలి.
అనాథ పిల్లలు, హెచ్‌ఐవీ బాధితులు, దివ్యాంగులు, షెడ్యూల్ కులాలు, ఫెడ్యూల్ తెగలు, బీసీ, మైనారిటిలతో పాటు అల్పాదాయ వర్గాల విద్యార్థులు అర్హులు.

ప్రైవేటులో పేదలకు ఉచిత విద్య