భూవివాదం కేసులో వ్యక్తికి జైలు, జరిమానా | - | Sakshi
Sakshi News home page

భూవివాదం కేసులో వ్యక్తికి జైలు, జరిమానా

Published Fri, Mar 14 2025 1:05 AM | Last Updated on Fri, Mar 14 2025 1:05 AM

భూవివాదం కేసులో వ్యక్తికి జైలు, జరిమానా

భూవివాదం కేసులో వ్యక్తికి జైలు, జరిమానా

భువనగిరి: భూ వివాదం కేసులో వ్యక్తికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ భువనగిరిలోని అసిస్టెంట్‌ సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి గురువారం తీర్పు వెల్లడించారు. భువనగిరి మండలంలోని బొల్లెపల్లి గ్రామానికి చెందిన జిట్టా శ్రీనివాస్‌రెడ్డికి అదే గ్రామానికి చెందిన వనం రమేష్‌, అతని సోదరుడు వనం సుమన్‌ల మధ్య భూ పంపకాల విషయంలో వివాదాలు నెలకొన్నాయి. ఈక్రమంలో వారు 2020 మే 18న శ్రీనివాస్‌రెడ్డిపై దాడికి పాల్పడారు. దీంతో ఆయన భువనగిరి రూరల్‌పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన అప్పటి ఎస్సై శంకరయ్య విచారణ చేసి కోర్టుకు పంపించారు. కేసు కోర్టులో విచారణలో ఉండగానే వనం సుమన్‌ 2022లో అనారోగ్య సమస్యలతో మృతి చెందాడు. గురువారం భువనగిరిలోని అసిస్టెంట్‌ సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి విచారణ చేసి వనం రమేష్‌కు సంవత్సరం జైలు శిక్ష, రూ.5వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు భువనగిరి ఎస్సై సంతోష్‌కుమార్‌ తెలిపారు.

చికిత్స పొందుతూ మహిళ మృతి

మునుగోడు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతిచెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మునుగోడు మండలం కచలాపురం గ్రామానికి చెందిన జంగ సుజాత(42) తల్లి చీకటిమామిడి గ్రామంలో ఉంటుంది. తన తల్లికి జ్వరం వస్తుండడంతో బుధవారం సుజాత తన కుమారుడితో కలిసి బైక్‌పై తల్లిని మునుగోడులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చూపించుకుని తిరిగి చీకటిమామిడికి వెళ్తున్నారు. మార్గమధ్యలో మునుగోడు మండల కేంద్రం పరిధిలోని పత్తి మిల్లు వద్ద గేదెకు ఢీకొట్టి ముగ్గురు కిందపడ్డారు. ఈ ప్రమాదంలో సుజాత తలకు తీవ్రంగా గాయం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. స్థానికులు 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతిచెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

లారీని ఢీకొట్టిన టిప్పర్‌.. డ్రైవర్‌కు గాయాలు

హుజూర్‌నగర్‌: ముందు వెళ్తున్న లారీని మట్టి లోడుతో వెళ్తున్న టిప్పర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్‌ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం హుజూర్‌నగర్‌ పట్టణంలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకూరు నుంచి హుజూర్‌నగర్‌ వైపు మట్టి లోడుతో వస్తున్న టిప్పర్‌ హుజూర్‌నగర్‌ పట్టణ పరిధిలోకి రాగానే ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో టిప్పర్‌ డ్రైవర్‌ కొండా వర్మ రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ముత్తయ్య తెలిపారు.

గొర్రెల మంద పైకి దూసుకెళ్లిన లారీ

పాలకవీడు: వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి గొర్రెల మంద పైకి దూసుకెళ్లడంతో 8 గొర్రెలు మృతిచెందాయి. ఈ ఘటన గురువారం పాలకవీడు మండల కేంద్రం సమీపంలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. పాలకవీడు మండలం నాగిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన మలిగిరెడ్డి అంజిరెడ్డి గొర్రెలు మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. రోజులాగే గురువారం కూడా గొర్రెలను మేపడానికి తోలుకెళ్తుండగా.. పాలకవీడు మండల కేంద్రం సమీపంలో లారీ అదుపుతప్పి గొర్రెల మంద పైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 8 గొర్రెలు మృతిచెందాయి. మరికొన్ని గొర్రెలకు గాయాలయ్యాయి. సుమారు రూ.లక్షకు పైగా నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు. పోలీసులు ఘటనా స్దలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

జూదరుల అరెస్ట్‌

అనంతగిరి: మండల పరిధిలోని ఖానాపురం శివారులో పేకాట ఆడుతున్న వారిని అనంతగిరి పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. ఎస్‌ఐ నవీన్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపురం గ్రామ శివారులో కొందరు పేకాట ఆడుతున్నట్లు సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఖానాపురం గ్రామానికి చెందిన ఐదుగురు పేకాట ఆడుతుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1430 నగదు. రెండు బైక్‌లు, నాలుగు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఇసుక డంపులు సీజ్‌

సూర్యాపేటటౌన్‌: అక్రమంగా డంప్‌ చేసిన ఇసుకను సీజ్‌ చేసి సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు రూరల్‌ ఎస్‌ఐ బాలునాయక్‌ తెలిపారు. గురువారం ఎస్సై బాలు నాయక్‌, తహసీల్దార్‌ శ్యాంసుందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని కేటీ అన్నారంలో తనిఖీలు నిర్వహించారు. ఈమేరకు కేటీ అన్నారానికి చెందిన బైరెడ్డి చిన్నారెడ్డి నాలుగు ట్రాక్టర్‌ ట్రిప్పుల ఇసుక, కప్పల సంజీవకు చెందిన 26 ట్రాక్టర్‌ ట్రిప్పులు, కప్పల సైదులు ఆరు ట్రిప్పుల ఇసుక, నంద్యాల రాంరెడ్డికి చెందిన 8 ట్రిప్పుల ఇసుక, కప్పల గురుమూర్తి 2 ట్రిప్పుల ఇసుక, శరభ చారి 4 ట్రిప్పుల ఇసుక.. మొత్తం 50 ట్రిప్పుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement