ఆడిటింగ్ పేరుతో అడ్డగోలుగా వసూళ్లు!
కోదాడ: మున్సిపాలిటీల్లోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో వసూళ్ల పర్వం కొనసాగుతోంది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో గడిచిన రెండు నెలలుగా ఆడిటింగ్ పేరుతో అధికారులు అడ్డగోలుగా రిసోర్స్ పర్సన్ల(ఆర్‌పీల) నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐదు మున్సిపాలిటీల్లో సుమారుగా 3,825 సమభావన సంఘాలున్నాయి. ప్రతి 15 సంఘాలకు ఒక ఆర్‌పీ చొప్పున 255 మంది ఉన్నారు. మహిళా సంఘాలకు లోన్లు ఇప్పించడం, ప్రభుత్వ పథకాలను సభ్యులకు అందేటట్టు చూడడం ఆర్‌పీల బాధ్యత. దీనికోసం ప్రతినెలా వీరికి రూ.6వేల వరకు గౌరవ వేతనం ఇస్తుంటారు. ప్రతిఏటా ఆర్‌పీలు తమ పరిధిలో కార్యకలాపాలకు సంబంధించి ఆడిటింగ్ చేయించుకోవాలి. కానీ ఇక్కడే వసూళ్ల తంతు మొదలవుతోంది.
ఫోన్ పే, గూగుల్ పే ద్వారా చెల్లింపులు..
జిల్లాలో ఈ ఏడాది జనవరి 20 తరువాత ఆడిటింగ్ మొదలైంది. దీన్ని ఒక ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. వారు ఆయా మున్సిపాలిటీలకు వెళ్లి అక్కడ ఉన్న ఆర్‌పీల రికార్డులను ఆడిటింగ్ చేయాలి. ఇంత వరకు బాగానేఉన్నా ఇక్కడే అసలు కథ మొదలైంది. ఆడిటింగ్ కోసం ప్రతి ఆర్‌పీ రూ.1,600 ఆడిటింగ్‌కు వచ్చిన వారికి ఇవ్వాలని షరుతు పెట్టారు. దీంతో పలువురు ఆర్‌పీలు ఈ డబ్బును ఫోన్‌పే, గుగూల్ పే ద్వారా చెల్లించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో జిల్లా స్థాయి అధికారి ఒకరు తమను బెదిరిస్తున్నట్లు ఆర్‌పీలు వాపోతున్నారు. తమకు ఇచ్చేది అరకొర వేతనాలు, అవికూడా సక్రమంగా ఇవ్వడం లేదని అలాంటిది తమ నుంచి ఇలా వసూలు చేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈసారి తమ నుంచి వసూలు చేసిన దాదాపు రూ.4లక్షలకుపైగా డబ్బుల విషయంపై ఉన్నాధికారులు విచారణ జరపాలని పలువురు ఆర్‌పీలు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
మెప్మాలో అవినీతి బాగోతం
ఒక్కో ఆర్‌పీల నుంచి
రూ.1,600 వరకు
255 మంది నుంచి
రూ.4 లక్షలు వసూలు
కలెక్టర్‌కు ఆర్‌పీలు ఫిర్యాదు
చేసినట్టు సమాచారం
మెప్మా ఇన్‌చార్జి పీడీ ఏమంటున్నారంటే..
ఈ విషయమై జిల్లా మెప్మా ఇన్‌చార్జి పీడీని వివరణ కోరగా తనను కొందరు టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నారు. రోజుకొకరు ఫోన్ చేస్తున్నారని, ఇది కరెక్ట్ కాదని, తాను వైద్యశాలలో ఉన్నానని తరువాత ఫోన్ చేస్తానని ఫోన్ కట్ చేశారు.