నీటి తిప్పలు తీర్చేలా..
యుద్ధప్రతిపాదికన పాతబోర్లు, చేతి పంపుల మరమ్మతులు
భానుపురి (సూర్యాపేట): జిల్లాలో ఎండలు ముదరడంతో నెలకొన్న మంచినీటి ఎద్దడి నివారణకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏ ఒక్క ప్రాంతంలో నీటి సమస్య లేకుండా ఉండేందుకు గాను జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది. ప్రధానంగా జిల్లాలో మంచినీటి వనరులైన మిషన్ భగీరథ పైపులైన్లు, చేతి పంపులు, బోర్లతో పాటు, చిన్న పైపులైన్ల మరమ్మతులను అధికారులు యుద్ధప్రతిపాదికన చేయిస్తున్నారు. జిల్లాలో ఈ వానాకాలం ఒక్కసారి మాత్రమే అధిక వర్షపాతం నమోదైంది. తదనంతరం వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రమాద ఘంటికలు మోగే పరిస్థితికి వచ్చాయి. మార్చి ప్రారంభంలోనే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న బోరుబావులు ఎండిపోయాయి. మిషన్ భగీరథ నీళ్లు చాలా ప్రాంతాలకు రావడం లేదు. ఈ నేపథ్యంలో యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఎక్కడెక్కడ నీటి సమస్య ఉందో ఇప్పటికే అధికారులు గుర్తించారు. జిల్లాలో తాగునీటి సరఫరాపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇటీవలే నల్లగొండ జిల్లాకేంద్రంలో జరిగిన సమీక్షలో కలెక్టర్ నీటి ఎద్దడి నివారణపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ సైతం ఇచ్చారు.
పాతవాటిని బాగుచేయిస్తూ..
ప్రతి మండలం, మున్సిపాలిటీ పరిధిలో ఏ ప్రాంతంలో నీటి ఎద్దడి ఉంటుంది..? అక్కడ ఏ విధంగా సమస్యను అధిగమించవచ్చో అధికారులు నివేదికలు తయారు చేశారు. ఇందుకు అనుగుణంగా నీటి ఎద్దడి నివారణ చర్యలు తీసుకుంటున్నారు. మిషన్ భగీరథ పథకం అమలైన తర్వాత జిల్లాలోని కొన్ని పట్టణాలు, గ్రామాల్లో బోరుబావులను పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మళ్లీ వాటి అవసరాన్ని గుర్తించి పునరుద్ధరించాలని నిర్ణయించారు. గ్రామాల్లో ఉన్న పాత బోరుబావులు, చేతిపంపులను సైతం పనిచేసేలా మరమ్మతులు చేస్తున్నారు. ఆవాసాల వారీగా నీటి సమస్య ఎక్కడ ఉందో గుర్తిస్తూ.. పైపులైన్లు పగిలిపోయిన చోట మరమ్మతులు చేపడుతున్నారు.
జిల్లావ్యాప్తంగా ఇలా..
జిల్లా వ్యాప్తంగా 475 పంచాయతీల్లో బోరుబావులు, పైపులైన్లు, మోటార్లు, చేతిపంపులను గుర్తించి మరమ్మతులు ప్రారంభించారు. గుర్తించిన పనులన్నింటికీ దాదాపు రూ.4.35 కోట్ల నిధులు అవసరమని అంచనా వేశారు. ఇందులో చేతిపంపులు 658, సింగిల్ పేస్ మోటార్లు 82, 147 త్రీఫేస్ మోటార్లకు, 16 ఓపెన్ బావులు, 200 ప్రదేశాల్లో పైపులైన్లకు మరమ్మతులు అవసరమని గుర్తించారు. గుర్తించిన మరమ్మతుల్లో ఇప్పటికే సగానికి పైగా పూర్తయ్యాయి.
వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా
ముందస్తు చర్యలు
ప్రత్యేక కార్యాచరణ
అమలు చేస్తున్న జిల్లా యంత్రాంగం
గుర్తించిన సమస్యలు 108..
పరిష్కరించినవి 54
Comments
Please login to add a commentAdd a comment