
పిడుగుపాటుతో రెండు ఆవులు మృతి
దేవరకొండ: పిడుగు పడి రెండు ఆవులు మృతి చెందాయి. దేవరకొండ మండలం కాసారం గ్రామానికి చెందిన రైతు అబ్బనోని నాగయ్య తనకున్న రెండు పాడి ఆవులను శనివారం రాత్రి తన వ్యవసాయ బావి వద్ద చెట్టుకు కట్టేసి ఉంచాడు. రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఆ సమయంలో పిడుగు పడి రెండు ఆవులు మృతిచెందాయి. ఆవుల విలువ రూ.1.20లక్షలు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతు కోరుతున్నాడు.
నకిలీ కరెన్సీ నోట్ల చలామణి
నడిగూడెం: నడిగూడెం మండల కేంద్రంలో నకిలీ రూ.100 నోట్లు చలామణి అవుతున్నాయని చిరు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన కరెన్సీ నోట్లు నీటితో తడిస్తే మరకలు పడవని, కానీ తమ వద్దకు వచ్చిన కొన్ని రూ.100 నోట్లపై నీటితో తడిస్తే ఏర్పడిన మరకలు ఉన్నట్లు చిరు వ్యాపారులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి నకిలీ నోట్లు చలామణి కాకుండా చూడాలంటున్నారు.
చెరువులో మునిగి
యువకుడి మృతి
తిరుమలగిరి: చెరువులో మునిగి యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధి అనంతారంలో ఆదివారం సాయంత్రం జరిగింది. అనంతారం గ్రామానికి చెందిన శీల శ్రీకాంత్(28) గేదెలను మేపడానికి గ్రామ పరిధిలోని పెద్ద చెరువు దగ్గరకి వెళ్లాడు. గేదెలు చెరువులోకి వెళ్లడంతో వాటిని బయట తోలుకురావడానికి చెరువులోకి వెళ్లి ఈత రాకపోవడంతో నీట మునిగి మృతిచెందాడు. మృతుడికి ఆరు నెలల క్రితమే వివాహం జరిగింది.
వైజాగ్ కాలనీలో ఈతకు వెళ్లి..
చందంపేట: నేరేడుగొమ్ము మండలం కాచరాజుపల్లి సమీపంలోని పుష్కర ఘాటు వద్ద నీట మునిగి హైదరాబాద్లోని బోడుప్పల్కి చెందిన శ్రీరామోజు ఉదయ్‌కిరణ్(22) మృతిచెందాడు. శనివారం నలుగురు స్నేహితులతో కలిసి వైజాగ్ కాలనీకి వచ్చిన ఉదయ్‌కిరణ్ ఆదివారం ఉదయం కాచరాజుపల్లి పుష్కర ఘాటు వద్ద ఈతకు వెళ్లి నీటిలో మునిగి మృతిచెందాడు. మృతుడి తండ్రి రాజేష్ కన్నా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు నేరేడుగొమ్ము ఎస్‌ఐ సతీష్ తెలిపారు.
రైతులను ఢీకొట్టిన లారీ
● ఒకరికి తీవ్ర గాయాలు
మిర్యాలగూడ అర్బన్: ధాధాన్యం అమ్మకానికి వచ్చిన రైతులు రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొట్టింది. ఈ ఘటన మిర్యాలగూడ పట్టణలో ఆర్టీఓ కార్యాలయం సమీపంలో ఆదివారం రాత్రి జరిగింది. వివరాలు.. దామరచర్ల మండలం కేశవాపురం గ్రామానికి చెందిన రైతులు జానకిరాములు, బచ్చు శ్రీను ట్రాక్టర్‌లో ధాన్యం లోడుతో మిర్యాలగూడ పట్టణంలోని ఆర్టీఓ కార్యాలయం సమీపంలో గల రైస్ మిల్లు వద్ద నార్కట్‌పల్లి–అద్దంకి రహదారిపై నిలిపారు. హోటల్‌లో భోజనం చేసిన అనంతరం రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ వారిద్దరిని ఢీకొట్టింది. జానకిరాములుకు తీవ్ర గాయాలు కాగా, బచ్చు శ్రీనుకు స్వల్ప గాయాలయ్యాయి. అంబులెన్స్‌లో వారిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. జానకిరాములు పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మిర్యాలగూడ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment