
ఫాంపాండ్‌లో మునిగి ఇద్దరు యువకులు మృతి
చిట్యాల: ఫాంపాండ్‌లో మునిగి ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ ఘటన చిట్యాల మండలం ఏపూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఆదివారం జరిగింది. చిట్యాల ఎస్‌ఐ ఎన్. ధర్మా తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ మండలం బసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మేస్త్రీ పనిచేసే నలపరాజు రాములు కుమారుడు నవీన్‌కుమార్(23), రసూల్‌పూర్ గ్రామానికి చెందిన హోంగార్డు చింతపల్లి లింగరాజు కుమారుడు రాఘవేంద్ర(20), నార్కట్‌పల్లి మండలం గోపలాయపల్లి గ్రామానికి చెందిన కడెం తరుణ్ స్నేహితులు. వీరు ముగ్గురు నల్లగొండలోని మార్కోని ఐటీఐ కాలేజీలో చదువుకున్నారు. ఐటీఐ పూర్తయిన తర్వాత ఏడాది క్రితం వీరు ముగ్గురు కలిసి చిట్యాల మండలం ఏపూరు గ్రామ పంచాయతీ పరిధిలోని డీఈసీ పరిశ్రమలో ఎలక్ట్రికల్ విభాగంలో అప్రెంటిస్‌గా చేరారు. అప్రెంటిస్ పూర్తిచేసి అదే పరిశ్రమలోని ఎలక్ట్రికల్ ప్యానెల్ మోడ్ మ్యానుఫ్యాక్చరింగ్ విభాగంలో ఉద్యోగాలు చేస్తున్నారు. శనివారం రాత్రి వరకు పరిశ్రమలో విధులు నిర్వహించిన వీరు రాత్రి పరిశ్రమలో ఉండిపోయారు.
ఫాంపాండ్‌లోకి దిగి..
సెలవు రోజు కావడంతో ఆదివారం కూడా పరిశ్రమలోనే ఉన్న నవీన్‌కుమార్, రాఘవేంద్ర, తరుణ్ మధ్యాహ్నం 12గంటల సమయంలో పరిశ్రమ ఆవరణలోని ఓ చివరలో నిర్వహిస్తున్న గోశాల సమీపంలో నీటి అవసరాల కోసం తీసిన ఫాంపాండ్ వద్దకు చేరుకున్నారు. మొదట నవీన్‌కుమార్ ఫాంపాండ్‌లోకి ఒకస్కారిగా దూకాడు. వెంటనే ఈత రాకపోయినప్పటికీ రాఘవేంద్ర ఫాంపాండ్‌లోకి దూకి నవీన్‌కుమార్‌ను పట్టుకున్నాడు. ఇద్దరు నీటిలో మునిగిపోతుండటంతో ఒడ్డున ఉన్న తరుణ్ తన షర్ట్‌తో వారిద్దరిని బయటికి లాగే ప్రయత్నం చేయగా.. ఇతడు కూడా ఫాంపాండ్‌లోకి జారి పడిపోబోయాడు. తరుణ్ తేరుకుని ఫాంపాండ్ చివరలో దొరికిన ప్లాస్టిక్ పట్టా అంచును పట్టుకుని బయటికి వచ్చి.. కొద్ది దూరంలో ఉన్న ఇతర కార్మికులకు విషయం తెలియజేశాడు. వారు వచ్చి నీటిలో మునిగిపోతున్న నవీన్‌కుమార్, రాఘవేంద్రను బయటికి తీయగా.. అప్పటికే వారిద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుల కుటుంబాలకు డీఈసీ పరిశ్రమ యజమాన్యం తగిన పరిహారం అందించి ఆదుకోవాలని బందువులు కోరుతున్నారు.
ప్రాణాలతో బయటపడిన
మరో యువకుడు
చిట్యాల మండలం ఏపూరు గ్రామ పరిధిలోని డీఈసీ పరిశ్రమలో ఘటన

ఫాంపాండ్‌లో మునిగి ఇద్దరు యువకులు మృతి
Comments
Please login to add a commentAdd a comment