సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తాం | - | Sakshi
Sakshi News home page

సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తాం

Published Mon, Mar 24 2025 6:24 AM | Last Updated on Mon, Mar 24 2025 6:23 AM

సాగున

సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తాం

హుజూర్‌నగర్‌, పాలకవీడు: ఉమ్మడి జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను అనుకున్న సమయానికి పూర్తిచేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి పాలకవీడు మండలం జాన్‌పహాడ్‌ దర్గా వద్ద నిర్వహించిన కందూరు కార్యక్రమానికి మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ రఘువీర్‌రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులు హాజరయ్యారు. అనంతరం స్థానిక డక్కన్‌ సిమెంట్‌ పరిశ్రమ అతిథి గృహంలో రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి వెంకట్‌రెడ్డితో కలిసి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో ఉత్తమ్‌ సమీక్ష నిర్వహించారు. వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్‌ఎల్‌బీసీ, డిండి, నెల్లికల్లు, నాగార్జునసాగర్‌ ఎడుమ కాల్వ, ఏఎంఆర్‌కు మరమ్మతులు చేయిస్తామని అన్నారు. గంధమల్ల ప్రాజెక్టుకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిందని, త్వరలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలోని ప్రజాపాలనతో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని మంత్రి చెప్పారు.

రోడ్ల అభివృద్ధిలో నంబర్‌ వన్‌గా ఉంచుతాం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రోడ్ల అభివృద్ధిలో ఉమ్మడి జిల్లాను రాష్ట్రంలో నంబర్‌ వన్‌గా ఉంచుతామని అన్నారు. రూ.వెయ్యి కోట్లతో రైల్వే బ్రిడ్జ్‌లు, రూ.140 కోట్లతో దామరచర్ల వద్ద బ్రిడ్జి నిర్మించేందుకు కేంద్ర మంత్రి అనుమతి ఇచ్చారన్నారు. బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకుండా గత ప్రభుత్వం పదేళ్లు పెండింగ్‌లో ఉంచిందని, మేము అధికారంలోకి రాగానే పూర్తిచేసి సీఎం చేతుల మీదుగా ప్రారంభించామన్నారు. దేవాదుల ద్వారా సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలకు సాగునీరు అందిస్తామన్నారు. దక్షిణ తెలంగాణలో 36 అసెంబ్లీ సీట్లకు కాంగ్రెస్‌ 32 గెలిచిందని..ప్రజలు మావైపు ఉన్నారనేందుకు ఇది నిదర్శనమన్నారు. ఇవన్నీ తెలియకుండా బీఆర్‌ఎస్‌ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. పదేళ్లు అధికారం ఇస్తే ఏమీ చేయని వారు పన్నెండు నెలలకే కొంపలు మునిగినట్లు మామీద పడుతున్నారని ఎద్దేవా చేశారు. రెండేళ్లలో అన్ని రోడ్లు బీటీగా మారుస్తామని, ఏప్రిల్‌ రెండవ వారంలో టెండర్లు పిలువనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వివరించారు. జాతీయ రహదారులను సైతం విస్తరించేలా కృషి చేస్తున్నామన్నారు. తొలుత హెలిపాడ్‌ వద్ద మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలకు కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌లు స్వాగతం పలికారు. సమావేశంలో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ రఘువీర్‌ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్యేలు పద్మావతిరెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, జైవీర్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, మందుల సామేలు, వేముల వీరేశం, బాలునాయక్‌, బీర్ల ఐలయ్య, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పాడి అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్‌ గుత్తా అమిత్‌రెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పటేల్‌ రమేష్‌రెడ్డి, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు కేతావత్‌ శంకర్‌ నాయక్‌, సీపీఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, భూక్యాగోపాల్‌, మాళోతు మోతీలాల్‌, సుబ్బారావు పాల్గొన్నారు.

ఫ ప్రజా పాలనతో విప్లవాత్మక మార్పులు

ఫ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ఫ జాన్‌పహాడ్‌ పరిధిలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి అభివృద్ధి పనులపై సమీక్ష

No comments yet. Be the first to comment!
Add a comment
సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తాం1
1/1

సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement