అవగాహనతోనే ‘క్షయ’ అంతం
బాధితులకు ప్రత్యేక చికిత్స
జిల్లాలో క్షయ నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. వ్యాధి సోకిన వారికి ఆరు నెలల పాటు ఉచితంగా ప్రత్యేక చికిత్స అందిస్తూ.. మందులు పంపిణీ చేస్తున్నాం. క్షయ వ్యాధి వ్యాప్తి చెందకుండా బాధిత కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తున్నాం. త్వరలో పెద్దలకు కూడా బీసీజీ టీకాలు వేస్తాం.
– డాక్టర్ నజియా, క్షయ నిర్మూలన అధికారి
ఫ నిర్ధారణ పరీక్షలు
చేయించుకుంటే మేలు
ఫ మూడు వారాలకు మించి
దగ్గు ఉంటే టెస్ట్ తప్పనిసరి
ఫ వ్యాధి నిర్ధారణ అయితే
ఆరు నెలల పాటు చికిత్స
ఫ గ్రామాల్లో ముగిసిన ప్రత్యేక శిబిరాలు
ఫ నేడు ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం
తిరుమలగిరి (తుంగతుర్తి): అవగాహనతోనే క్షయ వ్యాధిని అంతం చేయవచ్చని ప్రభుత్వం వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తోంది. ఇందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ద్వారా గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించి క్షయవ్యాధి బాధితులను గుర్తిస్తున్నారు. వ్యాధిగ్రస్తులు సకాలంలో మందులు వాడక పోవడంతో ఇతరులకు సోకే ప్రమాదం ఉందని అవగాహన కల్పిస్తున్నారు. బాధితులకు మందులు అందజేస్తూ వ్యాధి నిర్మూలనకు కృషి చేస్తున్నారు. ప్రతిఏటా మార్చి 24న ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం నిర్వహిస్తున్నారు.
వంద రోజుల ప్రోగ్రామ్ పూర్తి
జిల్లాలోని 23 మండలాల్లో క్షయ వ్యాధి నిర్మూలనకు వంద రోజుల ప్రోగ్రామ్‌ను డిసెంబర్ 7 నుంచి ఈనెల 18వ తేదీ వరకు అమలు చేశారు. ఇందులో భాగంగా క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. క్షయ లక్షణాలు ఉన్నవారిని గుర్తించా రు. అనంతరం వారిని జిల్లా ఆసుపత్రిలో సిబినాట్ యంత్రంతో తెమడ పరీక్షలు, ఎక్స్‌రే ఆధారంగా వ్యాధిగ్రస్తులుగా నిర్ధారిస్తున్నారు. పరీక్షల ఆధారంగా వ్యాధి నిర్ధారణ జరిగితే బాధితులకు ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు చికిత్స అందిస్తారు.
1.05 లక్షల మందికి ప్రాథమిక పరీక్షలు
జిల్లాలో ఇప్పటి వరకు 1.05 లక్షల మందికి ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. ఇందులో 8వేల మందికి ఎక్స్ రే తీసి 475 మంది వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు గుర్తించి చికిత్స అందిస్తున్నారు. ఉచితంగా పౌష్టికాహారం కూడా పంపిణీ చేస్తున్నారు. బీసీజీ టీకాలు పెద్దలకు కూడా వేయడానికి ఇప్పటికే అర్హులను గుర్తించి ఆన్‌లైన్ చేశారు.
క్షయ లక్షణాలు, నివారణ చర్యలు
మూడు వారాలకు మించి దగ్గు ఉండడం, దగ్గినప్పుడు రక్తం లేదా తెమడ (కఫం) పడడం, చాతీలో నొప్పి రావడం, రాత్రిపూట చెమటలు పట్టడం, అధిక ఉష్ణోగ్రతతో జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, ఆయాసంగా ఉండి అనారోగ్యంగా అనిపించడం వంటివి క్షయ వ్యాధి లక్షణాలుగా గుర్తించాలి. వ్యాధివ్యాప్తి చెందకుండా చేతులను తరచూ శుభ్రంగా కడగాలి. దగ్గినప్పుడు మోచేయి లేదా రుమాలును నోటికి అడ్డంగా పెట్టాలి. వ్యాధిగ్రస్తులకు దూరంగా ఉండాలి.
అవగాహనతోనే ‘క్షయ’ అంతం
Comments
Please login to add a commentAdd a comment