
కాంగ్రెస్ పార్టీ వైఫల్యంతోనే వక్ఫ్ బిల్లుకు ఆమోదం
వలిగొండ: కాంగ్రెస్ పార్టీ వైఫల్యంతోనే వక్ఫ్(సవరణ)–2025 బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. వలిగొండ మండలం ఎదుళ్లగూడెం గ్రామానికి చెందిన నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఎస్‌ఈ గూడూరు మోహన్‌రెడ్డి సంతాప సభను శనివారం టేకులసోమారం సమీపంలోని ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డితో కలిసి కల్వకుంట్ల కవిత హాజరై మోహన్‌రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ముస్లిం మైనార్టీల పట్ల చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. వక్ఫ్(సవరణ)–2025 బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంలో లోక్‌సభలో రాహుల్ గాంధీ నోరు మెదపలేదని, ప్రియాంక గాంధీకి లోక్‌సభకు రావడానికి కూడా తీరిక లేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీ వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడుతుందని తెలిపారు. అనంతరం టేకులసోమారం గ్రామానికి చెందిన పనుమటి జంగారెడ్డికి చెందిన ఎండిన పంట పొలాలను ఆమె పరిశీలించారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువుకాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువని ఆమె అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల గోస పట్టదని, పంటలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఎస్‌ఈ గూడూరు మోహన్‌రెడ్డి తన సొంత డబ్బుతో పాటు భూమిని కూడా దానమిచ్చి శ్రీవెంకటేశ్వర ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి 600 ఎకరాలకు సాగునీరందించి రైతులకు ఎంతో మేలు చేశారని ఆమె కొనియాడారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఈఈలు శ్యాంసుందర్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, సత్తిరెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తుమ్మ వెంకట్‌రెడ్డి, మొగుళ్ల శ్రీనివాస్‌గౌడ్, పనుమటి మమతానరేందర్‌రెడ్డి, డేగల పాండరి, ఎండీ అఫ్రోజ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఆలయంలో పూజలు..
భువనగిరిటౌన్: భువనగిరి మండలం నందనంలో నూతనంగా నిర్మించిన సీతారామచంద్రస్వామి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత శనివారం పూజలు చేశారు. వలిగొండ వెళ్తున్న ఆమెకు భువనగిరి వద్ద మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, రైతు సమన్వయ సమితి మాజీ కన్వీనర్ అమరేందర్ పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత