
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి
సాక్షి, చైన్నె: తమిళనాడుకు ప్రత్యేక చిహ్నంగా 108 సేవలు నిలుస్తున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ తెలిపారు. ఇప్పటి వరకు 1.46 కోట్ల మందికి ఈ అంబులెన్స్‌ల ద్వారా సేవలు అందించామన్నారు. వీటిని మరింత విస్తృతం చేయనున్నామన్నారు. మదురైలో ఆదివారం 108 ఉద్యోగ, కార్మికుల సంక్షేమం సంఘం తొలి మహానాడు జరిగింది. ఇందులో ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ ప్రసంగిస్తూ, 2008లో 200 వాహనాలతో అంబులెన్స్ సేవలకు డీఎంకే ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు వివరించారు.
ప్రస్తుతం 1,353 వాహనాలు ఉన్నాయని పేర్కొన్నారు. 205 అంబులెన్స్‌లను మరిన్ని వసతులతో తీర్చిదిద్దామని వివరించారు. మరో 65 అంబులెన్స్‌లు చిన్న పిల్లలకు అసవరమైన అన్ని రకాల సేవలతో రూపొందించామన్నారు. తాము ప్రస్తుతం అధికారంలోకి వచ్చినానంతరం రూ. 102 కోట్ల 28 లక్షలతో 293 అంబులెన్స్‌లను కొనుగోలు చేశామన్నారు. ఈ అంబులెన్స్‌లో తమిళనాడుకు ప్రత్యేక గుర్తింపు చిహ్నంగా మారినట్లు ధీమా వ్యక్తం చేశారు. ప్రపథమంగా తమ ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన ఈ పథకాన్ని, సేవలను అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా మలుచుకున్నాయని పేర్కొన్నారు.
రోజుకు 108 అంబులెన్స్‌కు 12,500 ఫోన్‌కాల్స్ వస్తున్నట్టు వివరించారు. 2008 నుంచి ఇప్పటి వరకు 1.46 కోట్ల 71 వేల 266 మంది సేవలు పొందారని తెలిపారు. కరోనా కాలంలో 108 సేవలు అభినందనీయమని, సిబ్బంది సేవలు వెలకట్ట లేనిదిగా పేర్కొన్నారు. కరోనా సమయంలో 542 అంబులెన్స్‌ల ద్వారా 6 లక్షల 30 వేల 500 మంది కరోనా రోగులను ఆస్పత్రులకు తరలించామన్నారు. ఈ అంబులెన్స్‌ల సేవలను మరింతగా విస్తరించనున్నట్లు తెలిపారు.