
నటి శ్రుతిహాసన్ విశ్వనటుడు కమలహాసన్ వారసురాలు అనే విషయాన్ని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ బ్రాండ్‌ను ఆమె సినీరంగప్రవేశానికి మాత్రమే ఉపయోగించుకున్నారు. ఆ తరువాత తన స్వశక్తితోనే కథానాయకిగా ఎదిగారు. ఈ విషయాన్ని ఆమె పలుమార్లు బహిరంగంగానే పేర్కొన్నారు. అంతేకాదు తాను తన కాళ్ల మీదే నిలబడ్డానని, ఆర్థికపరంగా ఎప్పుడూ తన తల్లిదండ్రులను సాయం కోరలేదని చెప్పారు. తనకు తన తల్లిదండ్రులు స్వేచ్ఛనిచ్చారని చెప్పే శ్రుతిహాసన్ ఇప్పటికీ స్వతంత్రభావాలతోనే సినీ రంగంలో నటిగా ఎదుగుతున్నారు.
ప్రస్తుతం ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం అంటూ బహుబాషా నటిగా పేరు తెచ్చుకున్నా తెలుగులో వరుస విజయాలతో క్రేజీ కథానాయకిగా వెలుగొందుతున్నారు. తమిళంలో ఇంతకుముందు విజయ్ సరసన పులి, అజిత్‌కు జంటగా వేదాళం, సూర్యతో ఏళాం అరివు, విశాల్ సరసన పూజై వంటి చిత్రాల్లో నటించినా ఎందుకనో ఇక్కడ పెద్దగా విజయాలను అందుకోలేకపోయారు. కాగా త్వరలో ఒక తమిళ చిత్రంలో నటించనున్నట్లు చెప్పారు. ఆ చిత్రం ఏమిటన్నది ఇప్పుడు ఆమె అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
కాగా కమలహాసన్ పక్కా నాస్తికుడు అన్న విషయం తెలిసిందే. అయితే అందుకు విరుద్ధ భావాలు కలిగిన నటి శ్రుతిహాసన్. తనకు దైవభక్తి ఎక్కువని చెప్పారు. అలాగని దేవాలయాలకు వెళ్లడానికి పెద్దగా ఆసక్తి చూపనని, మనసు ఆలయం అని భావిస్తానని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇంట్లో పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. ఇకపోతే తన ఆధ్యాత్మిక భావాన్ని వ్యక్తం చేసే విధంగా శ్రుతిహాసన్ తన వీపు పైభాగంలో శ్రుతి అని తన పేరుతో పాటు కుమారస్వామి ఆయుధం అయిన వేలాయుధం గుర్తును టాటూ వేసుకున్నారు. ఈ ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment