
కమలా హాసన్ నట వారసురాలు శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో పలువురు స్టార్ హీరోల సరసన మెప్పించింది. అయితే శృతి కేవలం హీరోయిన్ మాత్రమే కాదు.. అద్భుతమైన సింగర్ కూడా. ఆమె సినిమాలతో పాటు మ్యూజిక్ కన్సర్ట్స్‌కు కూడా హాజరవుతోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో గ్రాండ్ కన్సర్ట్ ప్లాన్ చేశారు. అయితే ఊహించని విధంగా ఆడియన్స్ షాకిచ్చారు ఆర్గనెజర్స్. ఇవాళ జరగాల్సిన సంగీత కచేరీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ విషయాన్ని ఆర్గనైజింగ్ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సాంకేతిక కారణాలతో శృతిహాసన్ మ్యూజిక్ కన్సర్ట్‌ను ఏప్రిల్ 26కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. టిక్కెట్లను ఇప్పటికే బుక్ చేసుకున్న అతిథులకు అదనపు ఖర్చు లేకుండా ప్రవేశం కల్పిస్తామని తెలిపారు. ఎవరైనా ఈవెంట్‌కు టికెట్ రద్దు చేసుకోవాలనుకుంటే డబ్బులు రిఫండ్ ఇచ్చేస్తామని స్పష్టం చేశారు. అయితే ఉన్నట్లుండి ఈ మ్యూజిక్ కన్సర్ట్‌ను వాయిదా వేయడంపై ఆడియన్స్ మండిపడుతున్నారు.

ఇక శృతి హాసన్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూలీ చిత్రంలో కనిపించనుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి స్క్రీన్‌ను పంచుకోనుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏడాది చివర్లో థియేటర్లలో విడుదల కానుంది. త్వరలో విడుదల తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది.