లారీలో అరి కొంబన్‌ను తరలిస్తున్న సిబ్బంది
సాక్షి, చైన్నె : కేరళ – తమిళనాడు సరిహద్దులలోని తేని జిల్లా వాసులను హడలెత్తిస్తూ వచ్చిన అరి కొంబన్ ఏనుగు ఎట్టకేలకు పట్టుబడింది. సోమవారం ఉదయం దీనికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పట్టుకున్నారు. కుంకీల సాయంతో లారీలో ఎక్కించి దట్టమైన అడవిలో వదిలి పెట్టేందుకు తీసుకెళ్లారు. వివరాలు.. కేరళ రాష్ట్రం ఇడిక్కి జిల్లా పరిధిలో గత కొంతకాలంగా అరి కొంబన్ ఏనుగు హడలెత్తిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏనుగు దాడికి పంట పొలాలు నాశనం అయ్యాయి. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి.
అనేక మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ప్రత్యేక ఆపరేషన్ ద్వారా ఈ ఏడాది ఏప్రిల్‌లో అతికష్టంపై ఈ ఏనుగును పట్టుకున్నారు. తెక్కడైలోని దట్టమైన పెరియార్ రిజర్వుర్ ఫారెస్ట్‌లోకి తీసుకెళ్లి వదలి పెట్టారు. దీనికి రేడియో కాలర్ అమర్చి కదలికలను పరిశీలిస్తూ వచ్చారు. అయితే, కేరళను వీడిన ఈ అరి కొంబన్ ఏనుగు గత నెలాఖరులో తమిళనాడులోని తేని జిల్లాలోకి ప్రవేశించింది.
వారం రోజులకు పైగా అవస్థలు
తేని జిల్లా పరిధిలోని కంబం పట్టణంలోకి తొలుత దూసుకొచ్చిన ఈ అరికొంబన్ రోడ్ల మీద పరుగులు తీస్తూ, వాహనాలపై తన ప్రతాపం చూపించింది. ఈ క్రమంలో పలువురిపై దాడి చేసింది. ఒకరిని కొట్టి చంపేసింది. గత వారానికి పైగా ఆ తర్వాత గూడలూరు పరిసరాలలో వీరంగం సృష్టించింది. దీంతో అక్కడ 144 సెక్షన్ అమలు చేశారు. జనం ఇళ్లకే పరిమితమయ్యారు. పట్టుకునేందుకు వచ్చిన అధికారుల కళ్లు గప్పి తప్పించుకుంటూ వచ్చిన ఈ అరికొంబన్ సోమవారం ఉదయం షణ్ముగా నదీ డ్యాం తీరంలో ఉన్నట్లు రైతులు గుర్తించారు.
తక్షణం అధికారులు, వైద్యులు అక్కడికి చేరుకున్నారు. పథకం ప్రకారం చాకచక్యంగా రెండుడోస్‌ల మత్తు ఇంజెక్షన్లను ఈ ఏనుగుకు ఇచ్చారు. వెను వెంటనే స్వయంబు, అరిసి రాజ, ఉదయన్ అనే మూడు కుంకీ ఏనుగుల సాయంతో అరి కొంబన్‌ను చుట్టుముట్టారు. కుంకీ ఏనుగుల సహకారంతో బలవంతంగా లారీలోకి అరి కొంబన్‌ను ఎ క్కించారు. ఇది మళ్లీ తప్పించుకోకుండా ఆగమేఘాలపై లారీలో దట్టమైన అడవిలో వదిలి పెట్టేందుకు తీసుకెళ్లారు. మార్గం మధ్యలో కట్టిన తాళ్లను ఈ ఏనుగు తెంచి పడేయడంతో ఉత్కంఠ నెలకొంది.
అతికష్టం మీద ఈ ఏనుగును బంధించారు. అడవిలోకి తీసుకెళ్లి వదిలి పెట్టే సమయంలో ఈ ఏనుగు ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా వైద్యులు పరిశీలించనున్నారు. వారం రోజులకు పైగా తమ కంటి మీద కునుకు లేకుండా చేసిన అరి కొంబన్ చిక్కడంతో తేని వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక్కడి పట్టణాలు, గ్రామాల్లో విధించిన 144 సెక్షన్‌ను వెనక్కి తీసుకున్నారు. ఇదిలా ఉండగా, ఈ అరి కొంబన్ రూపంలో ఎదురైన నష్టం తీవ్రతను అంచనా వేయడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు.
కలకాడు వాసుల నిరసన
పట్టుబడ్డ అరి కొంబన్ ఏనుగును తిరునల్వేలి జిల్లా కలకాడు అభయారణ్యంలో వదిలి పెట్టాలని రాష్ట్ర అటవీ అధికారులు నిర్ణయించారు. తేని నుంచి కలకాడుకు లారీలో ఈ ఏనుగును తీసుకొచ్చారు. అయితే కలకాడు అడవుల్లో ఈ ఏనుగును వదిలిపెట్టడాన్ని పరిసర గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఏనుగుతో వచ్చిన లారీని ప్రజలు సాయంత్రం అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అనేక మందిని పొట్టన పెట్టుకున్న ఈ ఏనుగును ఇక్కడ వదిలి పెడితే, తమకు భద్రత లేకుండా పోతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు నిరసన కారులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసినానంతరం అభయారణ్యంలోకి ఏనుగును తీసుకెళ్లారు. ప్రస్తుతం వైద్యుల అబ్జర్వేషన్‌లో అరి కొంబన్‌ఉంది. అదే సమయంలో ఈ ఏనుగును మది కట్టాం చోళైలో వదిలి పెట్టేందుకు ఆదేశించాలని కోరుతూ మదురై ధర్మాసనంలో పిటిషన్ దాఖలైంది.
Comments
Please login to add a commentAdd a comment