ఎన్నికల విజయోత్సవంగా...
సాక్షి, చైన్నె: దళపతి విజయ్ బర్త్‌డే సందర్భంగా ఆయన అభిమానులు రాజకీయ ప్రస్తావనతో బుధవారం హంగామా సృష్టించారు. వాతలైవా..వా( రా.నాయకుడా రా), నాలై మొదల్వన్( రేపటి సీఎ) అన్న నినాదాలతో తమిళనాట పోస్టర్లను హోరెత్తించారు. సినీ నటుడు విజయ్ రాజకీయ ప్రవేశ చర్చ తరచూ తెరపైకి వస్తున్న విషయం తెలిసిందే. అలాగే, ఇటీవల కాలంగా తన చిత్రాల్లో రాజకీయంగా చర్చకు తగ్గ వ్యాఖ్యల తూటాలను విజయ్ పేల్చుతూ వస్తున్నారు. ఇది వివాదాలకు సైతం దారి తీస్తున్నాయి.
అలాగే, విజయ్ ఇటీవల వేస్తున్న అడుగులు 2026 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని పయనం సాగిస్తున్నట్టుగా ఉంది. అభిమానులతో జిల్లాల వారీగా సమీక్షలు, సమావేశాలతో తరచూ విజయ్ బిజీ అవుతున్నారు. విజయ్ ఇయక్కంలో జాలర్లు, మహిళలు, విద్యార్థి విభాగాలను సైతం ఏర్పాటు చేసి ఉండడంతో రాజకీయ అరంగేట్రానికి సమయం ఆసన్నమవుతున్నట్టు ప్రచారం ఊపందుకుంది.
ఈ సమయంలో ఈనెల 17న చైన్నె వేదికగా విజయ్ నిర్వహించిన కార్యక్రమం మరింత రాజకీయ చర్చకు మార్గంగా మారింది. పది, ప్లస్‌టూ ఫలితాలలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను సత్కరించడమే కాకుండా ఓటు విలువ, రాజకీయాలు, భావినాయకుడి ఎంపిక అంశాలను తన ప్రసంగంలో విజయ్ గుర్తు చేశారు. దీంతో ఆయన 2026 ఎన్నికలే లక్ష్యంగా రాష్ట్ర రాజకీయాలలో కీలకం కావడం తథ్యమన్న ధీమాతో అభిమానులు ఉన్నారు.
పోస్టర్ల హోరు..
గురువారం దళపతి విజయ్ 48వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. ఆయన నటిస్తున్న లియో చిత్రం గురించిన కీలక టీజర్ లేదా పాటను విజయ్ విడుదల చేయడానికి సన్నద్ధమైనట్టు సమాచారం. అదే సమయంలో తమ అభిమాన హీరోను రాజకీయ తెరపైకి తెస్తూ అభిమానులు కోయంబత్తూరు, తిరునల్వేలి, మదురై, సేలం, తిరుచ్చి, పుదుచ్చేరి, దిండుగల్ నగరాలలో బుధవారం పోస్టర్లతో హంగామా సృష్టించారు.
ఈ పోస్టర్లు ప్రత్యేక ఆకర్షణగానే కాదు, రాజకీయంగా చర్చకు దారితీసింది. విజయ్ సచివాలయంలో కూర్చున్నట్టు, ఆయన పేరుకు ముందుగా సీఎం విజయ్ అని వ్యాఖ్యలతో ఫొటోలు పోస్టర్లలో ఉన్నాయి. అలాగే, రేపటి సీఎం, నేటి తలైవా..రేపటి తమిళ రక్షకుడు, వా తలైవా వా..ఉచిత విద్యను అందిద్దాం..అన్న పలు నినాదాలతో ఈ పోస్టర్లు హోరెత్తించారు. 2026లో విజయ్ సీఎం కావడం తథ్యమని తేల్చే రీతిలో ఈ పోస్టర్లను అభిమానులు హోరెత్తించి తమ ఉత్సాహాన్ని ప్రదర్శించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment