
మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబసభ్యులు
వేలూరు: అల్లేరి గ్రామానికి రోడ్డు వసతి లేకపోవడంతో పాము కాటుకు మరో కార్మికుడు మృతిచెందిన సంఘటన గ్రామస్తులను కలచివేసింది. వేలూరు జిల్లా అనకట్టు నియోజకవర్గం పరిధిలోని జవ్యాది కొండ, అల్లేరు వంటి 30కి పైగా గ్రామాలున్నాయి. అయితే ఈ ప్రాంతాల్లో ఎవరైనా అనారోగ్యానికి గురైనా, ప్రసవ నొప్పులు వచ్చినా డోలి కట్టి ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది.
దీంతో గ్రామస్తులు తమ గ్రామాలకు రోడ్డు వసతి ఏర్పాటు చేయాలని ప్రజా ప్రతినిధులు, అధికారుల వద్ద వినతి పత్రాలు అందజేసినా ఫలితం లేదు. ఇదిలా ఉండగా అల్లేరి గ్రామానికి చెందిన ఒకటిన్నర సంవత్సరాల చిన్నారి ప్రియ రెండు నెలల క్రితం పాము కాటుకు గురై రోడ్డు వసతి లేక ఆస్పత్రికి తీసుకెళ్లలేకపోవడంతో మృతి చెందిన విషయం తెలిసిందే.
అనంతరం మృతదేహాన్ని పది కిలోమీటర్ల దూరం తల్లి భుజంపై వేసుకుని వెళ్లిన విషయం సోషల్ మీడియాలో రావడంతో అఽధికారులు చర్యలు తీసుకుని రోడ్డు పనులను ప్రారంభించారు. ఇదిలాఉండగా అల్లేరి గ్రామానికి చెందిన శంకర్(38) బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా శంకర్ పాము కాటుకు గురయ్యాడు. అనంతరం అంబులెన్స్, వైద్య బృందానికి సమాచారం అందజేసి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబులెన్స్ వద్దకు తీసుకెళుతుండగా మార్గమధ్యలోనే శంకర్ మృతిచెందాడు.

మృతిచెందిన శంకర్(ఫైల్)