సాక్షి, చైన్నె: డీఎంకే వారసుడు ఉదయ నిధి స్టాలిన్ సోమవారం 46వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఇదే సమయంలో ఆయనకు డిప్యూటీ సీఎం పదవి అప్పగించాలనే నినాదం తెర మీదకు వచ్చింది. డిసెంబరులో జరిగే యువజన మహానాడు అనంతరం ఆయనకు ప్రమోషన్ ఖాయం అనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. వివరాలు.. రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి, డీఎంకే యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఉదయ నిధి స్టాలిన్ జన్మదినాన్ని డీఎంకే యువజన విభాగం వాడవాడలా సేవా కార్యక్రమాలతో ఘనంగా జరుపుకున్నాయి.
ఉదయాన్నే తండ్రి, సీఎం స్టాలిన్, తల్లి దుర్గా ఆశీస్సులను ఉదయ నిధి అందుకున్నారు. అదే సమయంలో డీఎంకే యూత్ నేతృత్వంలో ఉదయ నిధి కోసం ఎంగల్ అన్న ( మా అన్న)పేరిట ఓ పాటల సీడీని సిద్ధం చేసింది. అలాగే ఉదయ నిధి నటించి విజయవంతమైన మామన్నన్ చిత్రంలోని ఓ పాట ఆధారంగా మరో ప్రత్యేక గీతాన్ని సిద్ధం చేశారు. వీటిని మంత్రి అన్బిల్ మహేశ్ విడుదల చేశారు. ఇక రానున్న లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉదయ నిధి సేవలను మరింత విస్తృతంగా ఉపయోగించుకునేందుకు వీలుగా ఆయనకు ప్రమోషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం ఊపందుకుంది.
తండ్రి బాటలోనే..
తన తండ్రి, పార్టీ అధినేత కరుణానిధి వారసుడిగా డీఎంకే రాజకీయాల్లో ఎంకే స్టాలిన్ చక్రం తిప్పిన విషయం తెలిసిందే. తండ్రి సీఎంగా ఉన్న కాలంలో ఆయన డిప్యూటీ సీఎంగా అధికార వ్యవహారాల్లో దూసుకెళ్లారు. తండ్రి మరణంతో డీఎంకే పగ్గాలు చేపట్టి ప్రస్తుతం సీఎంగా ద్రవిడ మోడల్ పాలన నినాదంతో ముందుకెళ్తున్నారు. అదే సమయంలో తన వారసుడు ఉదయ నిధి స్టాలిన్‌ను సైతం రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో సినీ నటుడిగా డీఎంకే రాజకీయాల్లోకి వచ్చిన ఉదయ నిధి ప్రజాకర్షణలో ఫలితం సాధించారు.
2021 లోక్ సభ ఎన్నికలలో తండ్రి స్టాలిన్‌తో సమానంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారంలో దూసుకెళ్లడమే కాదు, చేపాక్కం ట్రిప్లికేన్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పగ్గాలు అందుకున్నారు. ఏడాది తర్వాత ఆయనకు మంత్రి పదవి అప్పగించాలని పలువురు సినీయర్లు నినాదించడంతో క్రీడల శాఖను కేటాయించారు. ప్రస్తుతం డిప్యూటీ నినాదం తెర మీదకు వచ్చిన నేపథ్యంలో ప్రమోషన్ ఉంటుందా..? లేదా..? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment