సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. దశాబ్ది ఉత్సవాలు పురస్కరించుకుని ఉద్యోగుల డీఏ, పెన్షనర్ల డీఆర్‌ను పెంచింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సోమవారం జీవో 50, జీవో 51లను జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగులు, పెన్షనర్ల బేసిక్ పే పైన 2.73 శాతం చొప్పున డీఏ/డీఆర్‌ను ప్రభుత్వం పెంచింది. పెంచిన డీఏ/డీఆర్ జనవరి 2022 నుంచి అమల్లోకి రానుంది.
ఈ ఏడాది జూన్ నెలకు సంబంధించి తాజాగా పెరిగిన డీఏ/డీఆర్‌ను జూలై నెల వేతనంతో కలిపి అందిస్తారు. గతేడాది జనవరి 1 నుంచి మే 31 వరకు ఇవ్వాల్సిన బకాయిలకు సంబంధించి ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ, డీఆర్ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వంపై నెలకు రూ.81.18 కోట్లు, సంవత్సరానికి రూ.974.16 కోట్ల అదనపు భారం పడనుంది. డీఏ, డీఆర్ పెంపుదలతో రాష్ట్రవ్యాప్తంగా 7.28 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. గతేడాది జనవరి నుంచి ఈ ఏడాది మే వరకు సంబంధించిన బకాయిలు రూ.1,380.09 కోట్ల చెల్లింపుపై ప్రభుత్వం అతి త్వరలో నిర్ణయం తీసుకోనుంది.
డీఏ పెరిగిందిలా..
కేటగిరీ ప్రస్తుత డీఏ– పెరిగిన డీఏ
- రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు: 20.02% నుంచి 22.75%కు పెంపు
- యూజీసీ/ఏఐసీటీఈ/ ఎస్‌ఎన్ జేపీసీ పేస్కేల్స్ (2016): 31% నుంచి 34%కు పెంపు
- యూజీసీ/ఏఐసీటీఈ/ ఎఫ్‌ఎన్ జేపీసీ పేస్కేల్స్ (2006): 196% నుంచి 203%కు పెంపు
- ఫుల్ టైమ్/ కంటింజెంట్: 148.068 శాతానికి పెరుగుదల
- పార్ట్ టైం/ వీఆర్‌ఏలు: నెలకు రూ.100 చొప్పున పెరుగుదల
(నోట్: డీఆర్ నిబంధన పరిధిలోనికి రాని పెన్షనర్లకు ఎలాంటి సవరణ ఉండదని, డీఆర్ సవరించిన పెన్షనర్లకు తదుపరి రూపాయిని కటాఫ్ గా నిర్ణయించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.)
ఇది కూడా చదవండి: శాతవాహన ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం: పెద్ద శబ్దం.. బోగీలపై వ్యాపించిన మంటలు
Comments
Please login to add a commentAdd a comment