సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ తరహాలో రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలను ‘పవర్ హౌస్’లుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలుచోట్ల ‘ఐటీ హబ్’లను నిర్మిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ రెండో ఐసీటీ (ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) పాలసీ (2021–26) ప్రకారం వచ్చే రెండేళ్లలో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో 25 వేల ఐటీ ఉద్యోగాల కల్పనతో పాటు, రాష్ట్ర ఐటీ ఎగుమతుల్లో 5 శాతం ఇక్కడి నుంచే సాధించేలా సన్నాహాలు చేస్తోంది.
రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ప్రభుత్వం ఇప్పటికే నిర్మించిన ఐటీ హబ్‌లతో పాటు ఇతర ప్రైవేటు సంస్థల ద్వారా 9 వేల ఐటీ ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లో టీఎస్‌ఐఐసీ ద్వారా నిర్మించిన ‘ఐటీ హబ్’ల్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఇక నల్లగొండ, నిజామాబాద్, ఆదిలాబాద్, సిద్దిపేటల్లో ఐటీ హబ్‌ల నిర్మాణం పనులు చివర దశకు చేరకున్నాయి.
ఈ నెల 15న సిద్దిపేట ఐటీ హబ్‌ను రాష్ట్ర మంత్రులు కేటీ రామారావు, హరీశ్‌రావుతో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు వరంగల్, ఖమ్మం ఐటీ హబ్‌లలో సీటింగ్ సామర్థ్యానికి మించి ఐటీ కంపెనీల నుంచి డిమాండ్ ఉండటంతో ఆయా ప్రాంతాల్లో రెండో దశ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. వరంగల్ ఐటీ హబ్ రెండో దశ నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభం కాగా, ఖమ్మంలోనూ త్వరలో ప్రారంభం కానున్నాయి.
పట్టణ ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధి
ది్వతీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు ఐటీ రంగ కార్యకలాపాలను విస్తరించడం ద్వారా ఉద్యోగాల కల్పనతో పాటు ఆయా ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇప్పటికే వరంగల్ లాంటి పట్టణాల్లో టెక్ మహీంద్ర, సియాంట్, ఎల్‌టీఐ మైండ్ ట్రీ, జెన్‌పాక్ట్ వంటి ప్రముఖ ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలు విస్తరించాయి. వరంగల్ ఐటీ హబ్‌లోనే ఏకంగా 2,500 మంది ఐటీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు లభించాయి.
స్టార్టప్‌లను ప్రోత్సహించడం, నైపుణ్య శిక్షణ ఇవ్వడం లక్ష్యంగా టీ హబ్, ‘టాస్‌్క’, వీ హబ్ వంటి సంస్థలు కూడా తమ ప్రాంతీయ కార్యాలయాలను ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని ఐటీ హబ్‌లలో ఏర్పాటు చేస్తున్నాయి. స్థానికంగా ఏర్పాటయ్యే ఐటీ కంపెనీలకు అవసరమైన మానవ వనరులను అందుబాటులోకి తెచ్చేందుకు టాస్క్ నిరంతర శిక్షణ కార్యక్రమాలు చేపడుతోంది.
సిద్దిపేటలో ఈ నెల 15న ప్రారంభమయ్యే ఐటీ హబ్‌లోనూ టాస్క్ ద్వారా ప్రతి బ్యాచ్‌లో 150 మంది నిరుద్యోగ యువతకు శిక్షణ తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో బ్యాచ్‌కు 45 రోజుల పాటు శిక్షణ ఇవ్వడంతో పాటు స్థానికంగా ఏర్పాటవుతున్న ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించే దిశగా ఐటీ శాఖ సన్నాహాలు చేస్తోంది.
పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా..
ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీ హబ్‌ల నిర్మాణంతో కంపెనీలను ఆకర్షించేందుకు ఐటీ శాఖ ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తోంది. ఇటీవలి యూకే, అమెరికా పర్యటనల్లో మంత్రి కేటీ రామారావు ఎన్‌ఆర్‌ఐ సీఈఓలతో ప్రత్యేక భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట, మహబూబ్‌నగర్, నల్లగొండ ఐటీ హబ్‌లలో కంపెనీల ఏర్పాటుకు అనేక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నాయి. సొనాటా సంస్థ నల్లగొండ ఐటీ టవర్‌లో 200 ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు వచ్చింది.
వనపర్తి, రామగుండంలోనూ..
ప్రస్తుతం కరీంనగర్, బెల్లంపల్లి వంటి పట్టణాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ఐటీ హబ్‌లలోనే కాకుండా పలు ప్రైవేటు సంస్థలు అద్దె భవనాల్లో ఐటీ కంపెనీలు నిర్వహిస్తున్నాయి. కరీంనగర్‌లో ఎక్లాట్ సొల్యూషన్స్ అనే కంపెనీ సుమారు వేయి మందికి ఉద్యోగాలు ఇచ్చింది.
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఐటీ హబ్‌లతో పాటు కొత్తగా వనపర్తి, రామగుండంలోనూ ఐటీ హబ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. భవిష్యత్తులో కనీసం 500 సీటింగ్ కెపాసిటీతో చిన్న పట్టణాల్లో మరిన్ని ఐటీ హబ్‌లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. – జయేశ్ రంజన్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment