సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సంస్థల సీఎండీలు, డైరెక్టర్ల మార్పు, కొత్తవారి నియామకంపై ఊహా గానాలు ఊపందుకున్నాయి. కొత్త సీఎండీలు, డైరెక్టర్ల నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని, ఇందుకు సంబంధించిన కసరత్తును ప్రారంభించిందని చెబుతున్నారు. సింగరేణి సంస్థ సీఎండీగా ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న ఎన్.శ్రీధర్.. ట్రాన్స్‌కో, జెన్‌కో సంస్థల సీఎండీ రేసులో ముందు వరుసలో ఉన్నట్టు సమాచారం.
అయితే ఆయన ఇప్పటికే ఆయన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎండీసీ సీఎండీగా ఎంపికైనా, ఇంకా నియామక ఉత్తర్వులు జారీ కాలేదు. శ్రీధర్ కాకుంటే, సీఎంకు అత్యంత విశ్వసనీయంగా ఉండే సీనియర్ ఐఏఎస్ అధికారుల్లో ఒకరిని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీగా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది.
తనకు విముక్తి కల్పించాలంటున్న ప్రభాకర్‌రావు..
తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో) సీఎండీగా, విద్యుత్ సరఫరా సంస్థ(ట్రాన్స్‌కో)ల ఇన్‌చార్జి సీఎండీగా డి.ప్రభాకర్‌రావు గత నెలతో 9 ఏళ్లు, 2019 జనవరి 10 నాటికి విద్యుత్ సంస్థల్లో 50 ఏళ్ల సుదీర్ఘ సర్వీసు పూర్తి చేసుకుని రికార్డు సృష్టించారు.
ఆయన అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్‌గా 1969 జనవరి 10న ఎలక్ట్రిసిటీ బోర్డులో చేరారు. విద్యుత్ రంగానికి సంబంధించిన విధానాల రూపకల్పన, నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ స్టేట్ పవర్ కోఆర్డినేషన్ కమిటీ (టీఎస్‌పీసీసీ) చైర్మన్ హోదాలో ఆయన డిస్కంల నిర్వహణను సైతం పర్యవేక్షించారు.
ఆయనకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (స్పెషల్ సీఎస్) హోదాను కట్టబెట్టి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ప్రస్తుతం 76 ఏళ్ల వయస్సులో ప్రభాకర్‌రావు వయోభారం, అనా రోగ్య సమస్యలతో ఇబ్బందులు పడు తున్నారు. తనను బాధ్యతల నుంచి తప్పిస్తే విశ్రాంతి తీసు కుంటానని గతంలో ఆయన విజ్ఞప్తి చేయగా సీఎం కేసీఆర్ తిరస్కరించారు.
ఈ నేపథ్యంలోనే గత నెల రోజులుగా ఆయన బహిరంగ సభల్లో తనకు బాధ్యతల నుంచి విముక్తి కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. సమీప భవిష్యత్తులో తాను బాధ్యతల నుంచి తప్పు కున్నా మరో విధంగా భావించవద్దని విద్యుత్ ఉద్యోగులకు ఆయన తాజా గా విజ్ఞప్తి చేశారు. తన విజ్ఞప్తులపై ప్రభుత్వం నుంచి సాను కూల సంకేతాలు అందిన నేపథ్యంలోనే ఆయనీ ప్రకటనలు చేశారని విద్యుత్ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
80 ఏళ్లకు చేరువలో ఉత్తర డిస్కం సీఎండీ..
ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీ డీసీఎల్) సీఎండీగా ఎ.గోపాల్ రావు ఆరున్నరేళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయన 2003లో చీఫ్ ఇంజనీర్‌గా రిటైరయ్యారు. ప్రస్తు తం ఆయన వయస్సు 78 ఏళ్లకు పైనే.
వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఆయన వృద్ధాప్య సమ స్యల వల్ల తరుచుగా హైదరాబాద్‌కు రావాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విద్యుత్ శాఖ వర్గాలు చెబుతు న్నాయి. ఆయన స్థానంలో కొత్త అధికారిని నియమించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని అంటున్నాయి.
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్) సీఎండీగా జి.రఘుమా రెడ్డి సైతం ఈ నెలలో 9 ఏళ్లను పూర్తి చేసుకోనున్నారు. ప్రస్తుతం ఆయన వయస్సు కూడా 71 ఏళ్లకు పైనే. ఒక వేళ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీగా నాన్ ఐఏఎస్ అధికారిని నియమించాలని ప్రభుత్వం భావిస్తే ఈయన పేరును సైతం పరిశీలించే అవకాశం ఉంది.
డైరెక్టర్లు కూడా దీర్ఘకాలంగా..
టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో 8 మంది, టీఎస్‌ఎన్పీ డీసీఎల్‌లో ఆరుగురు, ట్రాన్స్‌కోలో జేఎండీ, మరో నలుగురు డైరెక్టర్లు, జెన్‌కోలో ఆరుగురు డైరెక్టర్లు ఉన్నారు. వీరిలో చాలామంది 9 ఏళ్లకు పైగా ఆయా పదవుల్లో కొనసాగు తున్నారు. వీరిలో చాలామంది 70 ఏళ్లకు పైబడిన వారే.
కొన్ని విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్ల సంఖ్య మంజూరైన పోస్టు ల సంఖ్య కంటే పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో కొందరు డైరెక్టర్లను సాగనంపి వారి స్థానంలో కొత్తవారిని నియమించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment