శివ హోటల్‌లో భోజనాలు చేస్తున్న కస్టమర్లు.. ఇన్‌సెట్‌లో వడ్డించిన భోజనం, కూరలు
కూసుమంచి (ఖమ్మం జిల్లా): భోజనం చేసేందుకు ఏదైనా హోటల్‌కు వెళ్తే ఓ నాలుగు కూరలు, ఒక చట్నీ, సాంబారు, పెరుగుతో సరిపెడతారు. దీంతో కడుపు నిండినట్టు అనిపించనప్పటికీ సర్దుకుపోతాం. ఒకవేళ ఎక్కువగా తీనాలంటే మరింత ఖర్చు చేయాల్సి వస్తుంది. అంత ఖర్చు పెట్టలేని వారు అసంతృప్తితోనే బయటకు వస్తుంటారు. కానీ కూసుమంచిలోని నాగన్న, శివ హోటళ్లలో మాత్రం 20కి పైగా రకాల కూరలను వడ్డిస్తూ భోజన ప్రియులను సంతృప్తి పరుస్తున్నారు. సామాన్యులు వెచ్చించగల బడ్జెట్‌లోనే పసందైన భోజనం అందిస్తూ ఆకలి తీరుస్తున్నారు. ఇలాంటి హోటళ్లు ఎక్కడా లేవంటూ పలువురు మెచ్చుకుంటున్నారు.
(చదవండి: భక్తుల వద్ద హోంగార్డు చేతివాటం, క్రిమినల్ చర్యలకు ఈవో ఆదేశం)
నాగన్నతో మొదలు..
కూసుమంచిలోని నాగన్న (రామకృష్ణ ) హోటల్‌లో గత కొన్నేళ్లుగా వివిధ కూరలతో భోజనాలు వడ్డిస్తున్నారు. దీంతో ఈ హోటల్ ప్రత్యేకతను సంతరించుకుంది. కూసుమంచిలో ఖమ్మం– సూర్యాపేట రాష్ట్రీయ రహదారి పక్కన ఉండటంతో ఇక్కడ 24 కూరల భోజనం గురించి తెలుసుకుని అనేక మంది ప్రయాణికులు ఆగి మరీ భోజనాలు చేస్తుంటారు. పలువురు సినీ, రాజకీయ రంగాలకు చెందిన వారు కూడా ఈ హోటల్‌లో భోజనం చేసి అభినందించారు. ఈ హోటల్ యజమాని బెల్లంకొండ నాగన్న గత 20 ఏళ్లకు పైగా సేవలు అందిస్తూ గుర్తింపు పొందారు.
శివ హోటల్‌కు క్రేజ్..
కూసుమంచిలోని సూర్యాపేట రోడ్డులో ఏర్పాటు చేసిన శివ హోటల్ సైతం నాగన్న హోటల్ మాదిరిగా 24 కూరలను అందిస్తూ క్రేజ్‌ను సొంతం చేసుకుంటుంది. ఈ హోటల్‌లో కూరలతో పాటు చికెన్ కర్రీని అదనంగా వడ్డించడం ప్రత్యేకత. కాలానుగుణంగా అందుబాటులో ఉన్న అన్ని రకాల కూరగాయలు, ఆకు కూరలను యజమాని శివ సొంతంగా కొన్నింటిని పండిస్తూ, మరికొన్ని కొనుగోలు చేస్తూ 20 కూరలకు తగ్గకుండా భోజనాలు అందిస్తున్నారు. వెజిటేరియన్ కాకుండా నాన్‌వెజ్‌లో భాగంగా బిర్యానీ, చికెన్, చేప కూరలను ప్రత్యేకంగా అందిస్తున్నారు. అనతికాలంలోనే ఈ హోటల్ కూడా ఆదరణ పొందింది. మండల ప్రజలతో పాటు ఖమ్మం తదితర ప్రాంతాలకు చెందిన వారు ప్రత్యేకంగా కూసుమంచికి వచ్చి భోజనాలు చేస్తుండటం విశేషంగా చెప్పుకోవచ్చు.
(చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ముఖం చాటేశాడు..)
వడ్డించే కూరలు...
కూసుమంచిలోని నాగన్న, శివ హోటళ్లలో వివిధ రకాల కూరలు వడ్డిస్తున్నారు. వాటిలో పప్పు, దోసకాయ, దొండకాయ, గోరుచిక్కుడు, చిక్కుడు కాయ, సొరకాయ, పొట్లకాయ, వంకాయ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బీట్‌రూట్, బంగాళదుంప, చామగడ్డ, క్యారట్, కాకరకాయ, టమాట, బీర, సొరకాయ, బెండకాయ, పాలకూర, బచ్చలికూర, చుక్క కూర, గోంగూర, మామిడికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడితో పాటు సాంబారు, పెరుగు వడ్డిస్తారు. కాగా కూరలు సీజన్‌ను బట్టి కొంచెం మారుతుంటాయి. అయినప్పటికీ 20 కూరలకు తగ్గకుండా వడ్డిస్తుండటం ప్రత్యేకత. సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా భోజనం రూ.100 మాత్రమే తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
ఎక్కడా చూడలేదు..
మాది వరంగల్ జిల్లా కేసముద్రం. మేం కూసుమంచికి పనిమీద వచ్చాం. ఇక్కడ 20 కూరల భోజన హోటల్ బోర్డు చూసి వచ్చి తిన్నాం. ఇన్ని కూరలు వడ్డించే హోటల్ ఎక్కడా చూడలేదు. చాలా ఆశ్చర్యం వేస్తుంది. కూరలు కూడా చాలా బాగున్నాయి.
– లక్ష్మి, కేసముద్రం, వరంగల్ జిల్లా
తృప్తి మిగులుతుంది..
మా హోటల్‌లో రోజూ 20కి తగ్గకుండా కూరలు తయారు చేస్తాం. కస్టమర్ల తృప్తి మేరకు భోజనాలు వడ్డిస్తున్నాం. భోజన ప్రియుల అభిరుచి మేరకు నాన్‌వెజ్ ఐటమ్స్ కూడా ప్రత్యేకంగా తయారు చేస్తున్నాం. మంచి భోజనం అందిస్తున్నామనే తృప్తి మిగులుతుంది.
– భూక్యా శివ, శివ హోటల్ యజమాని
Comments
Please login to add a commentAdd a comment