
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో, ఈ ప్రమాద ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
వివరాల ప్రకారం.. ఎండపల్లి మండలంలోని కొత్తపేట వద్ద శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అయితే, సిద్దిపేట జిల్లాలోని బెజ్‌గాం గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో ఇటీవలే ఓ వృద్ధురాలు చనిపోయింది. ఈ నేపథ్యంలో, ఆమె అస్తికలను ధర్మపురి వద్ద గోదావరి నదిలో కలిపేందుకు ఆమె కుటుంబ సభ్యులు దాదాపు 25 మంది శుక్రవారం ఓ ప్రైవేటు బస్సులో బయల్దేరారు.
ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న బస్సును కొత్తపేట వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో బస్సును లారీ ఎదురుగా ఢీకొనడంతో డ్రైవర్ బస్సులోనే చిక్కుకుపోయాడు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అనంతరం.. జేసీబీ సహాయంతో డ్రైవర్‌ను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఇక, ప్రమాదంలో త్రీవంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉన్న ఐదుగురిని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, మిగతా వారిని జగిత్యాల ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment