lorry and bus accident
-
జగిత్యాల: బస్సును ఢీకొన్న లారీ.. ఐదుగురి పరిస్థితి విషమం
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో, ఈ ప్రమాద ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. ఎండపల్లి మండలంలోని కొత్తపేట వద్ద శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అయితే, సిద్దిపేట జిల్లాలోని బెజ్గాం గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో ఇటీవలే ఓ వృద్ధురాలు చనిపోయింది. ఈ నేపథ్యంలో, ఆమె అస్తికలను ధర్మపురి వద్ద గోదావరి నదిలో కలిపేందుకు ఆమె కుటుంబ సభ్యులు దాదాపు 25 మంది శుక్రవారం ఓ ప్రైవేటు బస్సులో బయల్దేరారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న బస్సును కొత్తపేట వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో బస్సును లారీ ఎదురుగా ఢీకొనడంతో డ్రైవర్ బస్సులోనే చిక్కుకుపోయాడు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అనంతరం.. జేసీబీ సహాయంతో డ్రైవర్‌ను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఇక, ప్రమాదంలో త్రీవంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉన్న ఐదుగురిని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, మిగతా వారిని జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. -
లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
చెన్నేకొత్తపల్లి (రాప్తాడు) : ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు వెనుకనుంచి ఢీకొంది. ఆర్టీసీ డ్రైవర్‌తోపాటు 15 మందికి గాయాలయ్యాయి. బాధితులు తెలిపిన మేరకు.. శుక్రవారం రాత్రి గుంతకల్లు నుంచి ఆర్టీసీ బస్సు (ఏపీ02 జెడ్ 0374) బెంగళూరుకు బయల్దేరింది. చెన్నేకొత్తపల్లి మండల కేంద్రం సమీపాన 44వ నంబరు జాతీయరహదారిపై కోన క్రాస్ వద్ద ఇంజిన్‌లో సాంకేతికలోపం తలెత్తడంతో లారీని రోడ్డు పక్కన నిలిపి ఉంచారు. హెచ్చరిక కోసం చిన్నపాటి కొమ్మలు, రాళ్లను రోడ్డుపై అడ్డు పెట్టారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో అక్కడకు చేరుకున్న ఆర్టీసీ బస్సు దీన్ని గమనించకుండా ముందుకు దూసుకెళ్లింది. అంతే ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చింది. గాఢనిద్రలో ఉన్న 23 మంది ప్రయాణికులు ఉలిక్కిపడి లేచారు. లారీని బస్సు ఢీకొన్నట్లు గుర్తించారు. బస్సు తలుపులు తెరుచుకోకపోవడంతో ప్రయాణికులు ఆర్తనాదాలు చేశారు. డ్రైవర్ కుమార్ స్టీరింగ్ సీటులోనే ఇరుక్కుపోయాడు. హైవే పెట్రోలింగ్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని, ఎస్ఐ మహమ్మద్ రఫికి సమాచారం అందించారు. అనంతరం హైవే పెట్రోలింగ్ పోలీసులు నాగరాజు, సుబ్బరాయుడుతో పాటు పలువురు పోలీసులు ఎమర్జన్సీ డోర్ పగులగొట్టి ప్రయాణికులను బయటకు తీశారు. బస్సులో మరో డ్రైవర్ కుళ్లాయప్ప కాలుకు గాయం కాగా.. 15 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను బయటకు తీసి 108లో అనంతపురం తరలించారు. ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. చెన్నేకొత్తపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ తూగడం వల్లే ప్రమాదం జరిగిందని, అయితే స్పీడు తక్కువ ఉండటంతో ప్రాణహాని తప్పిందని పలువురు ప్రయాణికులు తెలిపారు.