
సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని గడగడలాడి స్తున్న కరోనా మహమ్మారి.. పోలీసు విభాగానికి పెద్ద నష్టం చేసింది. ఒక్క హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే 34 మంది సిబ్బంది, అధికారులను పొట్టనపెట్టుకుంది. తొలి మరణం నమోదై ఆరున్నర నెలలు కావొస్తున్నా.. ఇప్పటికీ ఆ అమరవీరుల కుటుంబాలకు పరిహారం, కారుణ్య నియామకాలపై ఎలాంటి హామీ దక్కలేదు. ఉన్నతాధికారులు మాత్రం ఈ ప్రతిపాదనలు సర్కారు వద్ద పెండింగ్‌లో ఉన్నాయని చెబుతున్నారు. కాగా, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో తొలి కరోనా పాజిటివ్ కేసు ఏప్రిల్‌లో సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. మేలో కుల్సుంపుర ఠాణాలో పని చేస్తున్న కానిస్టేబుల్ దయాకర్‌రెడ్డి కన్నుమూశారు. అప్పటి నుంచీ సెప్టెంబర్ తప్ప అక్టోబర్ వరకు మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. రికార్డు అసిస్టెంట్ల నుంచి సబ్ ఇన్‌స్పెక్టర్ల వరకు వివిధ హోదాల్లో పని చేస్తున్న 34 మంది మరణించారు. ఈ షాక్ నుంచి ఆ కుటుంబాలు ఇప్పటికీ కోలుకోలేదు.
ఆ నగరాల్లో భరోసా..
కోవిడ్ నియంత్రణకు నిత్యం శ్రమించిన ఫ్రంట్‌లైన్ వారియర్స్ జాబితాలో పోలీసులదీ కీలక స్థానం. దీన్ని గుర్తించిన ఢిల్లీ సర్కారు ఈ వైరస్ బారినపడి మరణించిన పోలీసులకు రూ.కోటి పరిహారం ప్రకటించింది. ముంబై సహా మరికొన్ని నగరాల పోలీసులు కూడా భారీ మొత్తాన్నే ఇస్తామని హమీ ఇచ్చారు.
ఇక్కడ మాత్రం ఎదురుచూపులే..
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా లు, కమిషనరేట్లలోనూ వారియర్స్ మరణాలు నమోదయ్యాయి. అయితే ఇప్పటివరకూ వీరికి పరిహారం అందించే అంశంతో పాటు కారుణ్య నియామకాలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ లేదు. సాధారణ మరణాలకే కారుణ్య నియామకాలు వర్తింపజేసే ప్రభుత్వం పోలీసుల కుటుంబాలను మాత్రం వదిలేసింది.
మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు..
‘కుల్సుంపుర పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న మా సోదరుడు దయాకర్‌రెడ్డి కరోనాతో మే 20న చనిపోయాడు. ఆయనకు ఐదేళ్లు, ఏడేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు. కరోనాతో 5 రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. పరిహారం, కారుణ్య నియామకాల కోసం 3 నెలలుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎలాంటి మద్దతు లభించట్లేదు. కనీసం బతికున్న వారికైనా భరోసా ఇవ్వాలి కదా..?’
– సుధాకర్, దయాకర్‌రెడ్డి సోదరుడు
Comments
Please login to add a commentAdd a comment