సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో స్మార్ట్ సిటీస్ పథకంలో భాగంగా వరంగల్, కరీంనగర్ నగరాలను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ పథకం కింద వరంగల్‌కు రూ.500 కోట్లు, కరీంనగర్‌కు కూడా రూ.500 కోట్లు కేటాయించామని, ఇందులో ఇప్పటి వరకు రూ.392 కోట్లు విడుదల చేశామని వివరించారు. ఈ మేరకు ఆదివారం కిషన్‌రెడ్డి విడుదల చేసిన ఓ ప్రకటనలో.. రాష్ట్రంలో అభివృద్ధికి కేంద్రం చేపడుతున్న కార్యక్రమాలు వివరించారు. స్మార్ట్ సిటీస్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాలతో శరవేగంగా తెలంగాణలోని పట్టణాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.
స్మార్ట్ సిటీస్ మిషన్ పథకం కింద 50:50 నిష్పత్తిలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు వీటికి ప్రత్యేక నిధులను కేటాయించాల్సి ఉంటుందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తదుపరి విడత నిధులను విడుదల చేయాలంటే, రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటా నిధులను స్మార్ట్ సిటీలకు ఎప్పటికప్పుడు విడుదల చేయాల్సి ఉంటుందన్నారు. అలాగే సంబంధిత స్మార్ట్ సిటీకి విడుదల చేసిన మొత్తం నిధుల్లో కనీసం 75% నిధులను ఖర్చు చేసి ఉండాలని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇప్పటి వరకు వరంగల్‌కు రూ.50 కోట్లు, కరీంనగర్‌కి రూ.186 కోట్లు.. మొత్తంగా రూ.236 కోట్లను మాత్రమే విడుదల చేసిందన్నారు. మ్యాచింగ్ గ్రాంట్ నిధులను విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని, అలాగే కేంద్రం విడుదల చేసిన నిధులను కూడా స్మార్ట్ సిటీల పనులకు బదిలీ చేయడంలో అలసత్వం వహిస్తోందని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ నిధులను సకాలంలో విడుదల చేస్తే.. కేంద్ర ప్రభుత్వం కూడా తదుపరి విడత నిధులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉందన్నారు.
‘అమృత్’కు రూ.833 కోట్లు విడుదల
అమృత్ పథకంలో భాగంగా రాష్ట్రం నుంచి ఎంపికైన 12 పట్టణాలకు కేంద్ర ప్రభుత్వం రూ.833.36 కోట్లను విడుదల చేసిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. అమృత్ 2.0 పథకం కింద తెలంగాణ వ్యాప్తంగా 143 పట్టణాలు ఎంపిక చేసి వాటికి కూడా నిధులను కేటాయించామన్నారు. ఈ 143 పట్టణాలలో రూ.2,780 కోట్లతో మురుగునీటి నిర్వహణ, శుభ్రమైన తాగునీటి సరఫరా వంటి వ్యవస్థలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ప్రాజెక్టుల డీపీఆర్‌లు అందించటానికి ఇప్పటికే రూ.100 కోట్ల నిధులు విడుదల చేశామని కిషన్‌రెడ్డి వెల్లడించారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం, తెలంగాణకు రూ. 4,465.81 కోట్లను కేటాయించగా, ఇప్పటి వరకు రూ.3,128.14 కోట్లను విడుదల చేశామని తెలిపారు. ఈ పథకంలో భాగంగా తెలంగాణకు 2,49,465 ఇళ్లను మంజూరు చేయగా, 2,39,422 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయన్నారు. ఇందులో 2,15,443 ఇళ్ల నిర్మాణం పూర్తయినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వంతో కలసి చేపట్టిన ఇళ్ల నిర్మాణ పనులు నివేదికల్లో లెక్కలకు, వాస్తవ లెక్కలకు పొంతన లేకుండా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామని నమ్మించిన రాష్ట్ర ప్రభుత్వం వేగవంతమైన చర్యలను తీసుకోవడంలో విఫలమైందని కిషన్‌రెడ్డి ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment