సిటీ బస్.. టాప్ గేర్ | 500 electric buses in hyderabad | Sakshi
Sakshi News home page

సిటీ బస్.. టాప్ గేర్

Published Mon, Jan 1 2024 8:13 AM | Last Updated on Mon, Jan 1 2024 1:18 PM

500 electric buses in hyderabad - Sakshi

హైదరాబాద్: సిటీ బస్సు ఇక రయ్‌రయ్‌మని పరుగులు తీయనుంది. నూతన సంవత్సరం కొత్త సరీ్వసులు అందుబాటులోకి రానున్నాయి. కాలం చెల్లిన పాత బస్సుల స్థానంలో ఇప్పటి వరకు కొత్తవాటిని ప్రవేశపెట్టకపోవడంతో  ప్రయాణికుల రద్దీకనుగుణంగా బస్సులను నడపడం అసాధ్యంగా మారింది. మహిళా ప్రయాణికులకు ఉచిత సదుపాయంకల్పించినప్పటి నుంచి ఆక్యుపెన్సీ రేషియో గణనీయంగా పెరిగింది. దీంతో పలు మార్గాల్లో అదనపు బస్సులను నడపడం తప్పనిసరిగా మారింది. 

ప్రత్యేకంగా ఉదయం, సాయంత్రం స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థుల డిమాండ్‌ మేరకు బస్సులు అందుబాటులో లేకపోవడంతో నగర శివార్లలోని ఇంజినీరింగ్‌ కళాశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు కూడా రద్దీ కారణంగా సకాలంలో చేరుకోలేకపోతున్నారు. దీంతో యుద్ధప్రాతిపదికన 340  బస్సులను అద్దెకు తీసుకొనేందుకు ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ చర్యలు చేపట్టింది.

 ఇంచుమించు కొత్త ఏడాది ఆరంభంలోనే ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం  నగరంలోని వివిధ మార్గాల్లో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగిస్తున్న ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సుల తరహాలోనే మరో 500 కొత్త బస్సులను నగరంలో ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. జూన్‌ నాటికి  ఈ బస్సులు  అందుబాటులోకి రానున్నట్లు  అధికారులు  తెలిపారు. దీంతో కొత్త సంవత్సరం  840 కొత్త బస్సులు  నగరంలో వినియోగంలోకి రానున్నాయి. ఈ బస్సులతో ప్రయాణికులకు కొంత మేరకు ఊరట లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. 
 
కోటిన్నర దాటి.. 
మహాలక్ష్మి పథకం గ్రేటర్‌లో విజయవంతంగా కొనసాగుతోంది. ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రతి రోజు సుమారు 8 లక్షల మంది మహిళలు సిటీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నట్లు అంచనా. డిసెంబరు 9వ తేదీన ఈ పథకం అందుబాటులోకి వచి్చన సంగతి తెలిసిందే. గతంలో 4 నుంచి 5 లక్షల మంది మహిళలు సిటీ బస్సుల్లో  ప్రయాణం చేయగా.. ఈ పథకం  వినియోగంలోకి వచి్చన తర్వాత ఏకంగా 8 లక్షలకు చేరింది. రోజు రోజుకు మహిళా ప్రయాణికులు పెరుగుతున్నారు. దీంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళా ప్రయాణికుల సంఖ్య కోటిన్నర దాటినట్లు అంచనా.  

గతంలో  67 నుంచి 69 శాతం వరకు ఉన్న ఆక్యుపెన్సీ రేషియో కూడా  80 శాతం దాటింది. రద్దీ రూట్‌లలో మహిళలు సైతం ఫుట్‌బోర్డుపై ప్రయాణం చేయాల్సివస్తోంది. మరోవైపు ఉచిత ప్రయాణ సదుపాయంతో మహిళా  ప్రయాణికుల సంఖ్య పెరగడంతో ఉదయం కాలేజీలకు వెళ్లే విద్యారి్థనులు  ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం పూట కాలేజీకి వెళ్లాల్సిన  సమయంలో బస్సులు కిక్కిరిసిపోతుండటంతో ప్రయాణం అసాధ్యంగా మారుతోంది. దీంతో అదనపు ట్రిప్పులు ఏర్పాటు చేయాలని విద్యారి్థనులు డిమాండ్‌ చేస్తున్నారు.
 
నగర శివార్లలో పెరిగిన రద్దీ... 
ఉచిత ప్రయాణ సదుపాయంతో శివారు ప్రాంతాల్లోంచి నగరంలోకి రాకపోకలు సాగించే బస్సుల్లో రద్దీ భారీగా పెరిగింది. డిమాండ్‌కు తగినవిధంగా బస్సులు లేకపోవడంతో అందుబాటులో ఉన్న బస్సుల్లోనే ప్రయాణం చేయాల్సివస్తోంది. ‘సాధారణంగానే కొద్ది రోజులుగా రాకపోకలు పెరిగాయి. ఈ పథకం వినియోగంలోకి వచి్చన తర్వాత రద్దీ మరింత ఎక్కువైంది. కానీ కొత్త బస్సులు వచ్చే వరకు ట్రిప్పులను పెంచడం సాధ్యం కాదు కదా’ అని ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు. డిపోల్లో స్పేర్‌లో ఉండే 10 శాతం బస్సులను సైతం నడుపుతున్నట్లు  చెప్పారు. గ్రేటర్‌లో ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తేనే రోడ్లపై వాహనాల రద్దీ తగ్గుతుంది. ఈ దిశగా కొత్త ప్రభుత్వం దృష్టి సారించాలని ఆశిద్దాం.  

ఫ్యామిలీ–24 టికెట్లు రద్దు 
మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్‌లో జారీ చేసే ఫ్యామిలీ–24, టి–6 టికెట్లను నేటి నుంచి ఉపసంహరించుకోనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జరార్‌ ఎక్స్‌ వేదికగా తెలిపారు. ఫ్యామిలీ– 24, టి–6 టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్లు చూడాలి. వారి వయసును నమోదు చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మి పథకం  వల్ల రద్దీ పెరగడంతో ఫ్యామిలీ–24, టి–6 జారీకి కండక్టర్లకు చాలా సమయం పడుతోంది. ఫలితంగా బస్‌ సర్వీసుల ప్రయాణ సమయం కూడా పెరుగుతుంది. దీంతో  ప్రయాణికులకు అసౌకర్యం కలిగించవద్దనే ఉద్దేశంతోనే ఈ టికెట్లను ఉపసంహరించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం నుంచి సిటీ బస్సుల్లో ఈ టికెట్లు లభించవు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement