సాక్షి, హైదరాబాద్: డిజిటల్ ఫోరెన్సిక్, డేటా రికవరీలో పేరొందిన రష్యా సంస్థ ‘ఏసీఈ ల్యాబ్’మరో కంపెనీ ‘జూమ్ టెక్నాలజీస్’తో కలిసి హైదరాబాద్‌లో ఫోరెన్సిక్ సెంటర్, మాన్యుఫాక్చరింగ్ హబ్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. మంగళవారం ఏసీఈ ల్యాబ్ సీవోవో మ్యాక్స్ పుతివ్ సేవ్, జూమ్ టెక్నాలజీస్ సీవోవోతోపాటు ఆయా సంస్థల ప్రతినిధులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో భేటీ అయ్యారు.
సంబంధిత ప్రతిపాదనలు, ప్రభుత్వపరంగా అందించాల్సిన సహాయ సహకారాల గురించి వివరించారు. 129 దేశాల్లో తమ సంస్థ కార్యకలాపాలు ఉన్నాయని, సైబర్ సెక్యూరిటీ రంగంలో ఆయా దేశాల దర్యాప్తు సంస్థలతో కలిసి పనిచేస్తున్న అనుభవం తమకు ఉందని వివరించారు. డేటాలాస్, డిజిటల్ ఇన్వెస్టిగేషన్ సవాళ్లను అధిగమించడానికి భారతీయ వ్యాపారాలు, బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు, దర్యాప్తు సంస్థలకు సహకరిస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో అంతర్జాతీయ దిగ్గజ సంస్థ డేటా సెంటర్ ఏర్పాటు కోసం ముందుకు రావడంపట్ల మంత్రి శ్రీధర్‌బాబు హర్షం వ్యక్తం చేశారు.
కాగా ‘టిబెటన్ పార్లమెంట్ ఇన్ ఎక్సైల్’ప్రతినిధులు మంగళవారం శ్రీధర్‌బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. టిబెట్‌కు సార్వ¿ౌమాధికారాన్ని కల్పించేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతినిధి బృందంలో మాంక్ గేశే అతుక్ సెతాన్, ఎంపీ సెరింగ్ యంఘ్చెన్, దొండప్ తాషి తదితరులు ఉన్నారు.
బయో ఆసియా 2024లో ‘ఫ్రాండర్స్’భాగస్వామ్యం
ఆసియాలోనే జీవ శాస్త్ర, ఆరోగ్య సాంకేతిక రంగాల వేదికగా పనిచేస్తున్న ‘బయో ఆసియా’21వ వార్షిక సదస్సుకు బెల్జియంలో లైఫ్‌సైన్సెస్, ఆరోగ్య రంగాలకు కేంద్రంగా ఉన్న ఫ్లాండర్స్ రీజియన్ భాగస్వామ్యం వహించనుంది. త్వరలో హైదరాబాద్ వేదికగా జరిగే ‘బయో ఆసియా–2024’లో ఫ్రాండర్స్ రీజియన్ భాగస్వామ్యంపై మంత్రి శ్రీధర్‌బాబు మంగళవారం కీలక ప్రకటన చేశారు.
లైఫ్‌సైన్సెస్ పరిశ్రమకు కేంద్రంగా ఉన్న తెలంగాణలో ఫార్మా, బయో టెక్నాలజీ, వైద్య పరిశోధన రంగాల వృద్ధికి అనువైన వాతావరణం ఉందని శ్రీధర్‌బాబు అన్నారు. శాస్త్రీయ పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలో ఘనమైన చరిత్ర కలిగిన ఫ్లాండర్స్ రీజియన్ బయో ఆసియాలో భాగస్వామ్యం వహించడం ఇరు ప్రాంతాల నడుమ పరిశోధన ఫలాల మార్పిడికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు.
భాగస్వామ్య పెట్టుబడులు, జాయింట్ వెంచర్లు, పరిశోధన, అభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు ఈ భాగస్వామ్యం దోహదం చేస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. ప్రస్తుత భాగస్వామ్యం ద్వారా వాణిజ్యవేత్తలు, పరిశోధకులు, విధాన నిర్ణేతలు ఒకే వేదికపైకి వచ్చి ఇరు ప్రాంతాల నడుమ భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలపై చర్చిస్తారని ఫ్లాండర్స్ తరపున దక్షిణ భారతదేశంలో పెట్టుబడులు, వాణిజ్య వ్యవహారాల పర్యవేక్షకులు జయంత్ నాడిగర్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment