సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై న్యాయవిచారణ నిర్వహించేందుకు సిట్టింగ్ జడ్జి సేవలను కేటాయించాల్సిందిగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని మరోసారి కోరతామని పరిశ్రమలు, ఐటీ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ ప్రాజెక్టుపై విచారణ కోసం సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని గతంలోనే హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను కోరామని, అయితే జడ్జీల సంఖ్య తక్కువగా ఉన్నందున ఇవ్వలేమని, విశ్రాంత న్యాయమూర్తిని అందుకు కేటాయిస్తామని హైకోర్టు నుంచి జవాబు వచ్చిందన్నారు.
ఈ నేపథ్యంలో విచారణకు సిట్టింగ్ జడ్జిని కేటాయించాల్సిందిగా మరోసారి లేఖ రాస్తామని వెల్లడించారు. శనివారం అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కాళేశ్వరం అవినీతిపై న్యాయవిచారణ జరిపిస్తామని స్పష్టంగా పేర్కొన్నామని గుర్తుచేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సీబీఐతో విచారణ జరిపిస్తామంటే అడ్డు చెప్పబోమని పేర్కొన్నారు.
విచారణ జరిపించ దలుచుకుంటే కేంద్రానికి సీబీఐయే కాకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌తో కూడా జరిపించేందుకు అవకాశం ఉందన్నారు. అయితే ఈ విభాగాలతో కేంద్రం విచారణ జరిపిస్తే మాత్రం బీఆర్‌ఎస్–బీజేపీ ఒక్కటవుతాయనే అనుమానం కూడా తమకుందన్నారు.రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమున్నా కాళేశ్వరంపై ప్రాజెక్టుపై విచారణ జరిపించే ఉండేవారని, అందుకోసం విచారణకు సిట్టింగ్ జడ్జిని కూడా ఇచ్చి ఉండేవాళ్లని చెప్పారు.
గతంలోనూ వివిధ అంశాలపై పలు సందర్భాల్లో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిగిన ఉదంతాలున్నాయని, అందువల్ల సిట్టింగ్ జడ్జిని ఎప్పుడూ విచారణకు ఇవ్వలేదనే వాదనలు అవాస్తవమని ఒక ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఇదిలా ఉంటే... బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్వాకంపై కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) విడుదల చేసిన నివేదికలోని అంశాలపైనా తమ ప్రభుత్వం విచారణ జరిపిస్తుందని శ్రీధర్‌బాబు చెప్పారు.
కేఆర్‌ఎంబీ చర్చంటే.. బీఆర్‌ఎస్ సభ్యులు పారిపోయారు
కృష్ణానది యాజమాన్య బోర్డు అంశంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో పాల్గొనకుండా బీఆర్‌ఎస్ సభ్యులు పారిపోయారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. శనివారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీ సభ్యులు సూచనలు చేస్తే తప్పకుండా స్వీకరిస్తామన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డబుల్ డిజిట్ సీట్లు వస్తాయన్నారు. నల్లగొండ సభకు వెళ్లిన కేసీఆర్‌కు శాసనసభకు రావడానికి ఇబ్బంది ఏమిటో అర్థం కావడం లేదన్నారు.
సభలో ఏయే పార్టీలు ఎంతెంత సమయమంటే..
8 రోజుల పాటు 45 గంటల 32 నిమిషాలు సభ నిర్వహించామని, 59 మంది సభ్యులు సభలో మాట్లాడారని, 64 మంది సభ్యులు జీరో అవర్‌లో మాట్లాడారని, 2 తీర్మానాలను పాస్ చేశామని, 3 బిల్లులకు ఆమోదం తెలిపామని శ్రీధర్‌బాబు వివరించారు.
సభ్యులందరూ సవివరంగా మాట్లాడే అవకాశం కల్పించామని, పార్టీల వారీగా కాంగ్రెస్‌కు 8 గంటల 43 నిమిషాలు, బీఆర్‌ఎస్‌కు 8 గంటల 41 నిమిషాలు, బీజేపీకి 3 గంటల 48 నిమిషాలు, ఎంఐఎంకు 5 గంటలు, సీపీఐకి 2 గంటల 55 నిమిషాలు అవకాశం ఇచ్చామని చెప్పారు. కాగా, కౌన్సిల్ 11 గంటల 5 నిమిషాల పాటు జరిగిందని శ్రీధర్‌బాబు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment